టిఎస్ డీఎస్సీ దరఖాస్తుల గడువు పొడిగింపు

March 15, 2024
img

తెలంగాణ ప్రభుత్వం డీఎస్సీ-2024 ద్వారా 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసి మార్చి 4 నుంచి ఏప్రిల్‌ 2వరాకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా టెట్-2024 (టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్)కి నోటిఫికేషన్‌ జారీ చేయడంతో, ఆ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులకు కూడా డీఎస్సీ-2024లో అవకాశం కల్పించాలనే ఉద్దేశ్యంతో దరఖాస్తు గడువును జూన్ 20 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మరో 3 లక్షల మందికి డీఎస్సీ-2024 పరీక్షలు వ్రాసే అవకాశం లభిస్తుంది. 

టెట్, డీఎస్సీ-2024 పరీక్షల షెడ్యూల్: 

ఈ నెల 27 నుంచి ఏప్రిల్‌కు 10వరకు టెట్ పరీక్షలకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు.  మే 20 నుంచి జూన్ వరకు టెట్ పరీక్షలు జరుగుతాయి. వాటి ఫలితాలు వెలువడిన తర్వాత జూలై 17 నుంచి 31వరకు డీఎస్సీ-2024 పరీక్షలు జరుగుతాయని పాఠశాల విద్యాశాఖ తెలియజేసింది. 

డీఎస్సీ-2024లో మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టులలో స్కూల్ అసిస్టెంట్: 2,629, లాంగ్వేజ్ పండిట్: 727,  పీఈటీలు: 182, ఎస్జీటీలు: 6,508, స్పెషల్ ఎడ్యుకేషన్‌ స్కూల్ అసిస్టెంట్: 220, ఎస్జీటీ: 796 పోస్టులున్నాయి. 

హైదరాబాద్‌లో అత్యధికంగా 878 పోస్టులు ఉండగా, ఖమ్మం: 757, నల్గొండ: 605, నిజామాబాద్‌: 601, సంగారెడ్డి: 551, కామారెడ్డి: 506 పోస్టులు ఉన్నాయి. 

హైదరాబాద్‌, రంగారెడ్డి,మెదక్‌, సంగారెడ్డి నల్లగొండ, వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాలలో పరీక్షా కేంద్రాలలో ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించనున్నారు.

డీఎస్సీ అభ్యర్ధులకు సాయపడేందుకు హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేసింది: ఫోన్ నంబర్లు: 91541 14982, 63099 98812. ఈమెయిల్: helpdesktsdsc2024@gmail.com 

Related Post