లోక్‌సభ ఎన్నికలలో పోటీకి మళ్ళీ బర్రెలక్క సై!

April 24, 2024


img

తెలంగాణ శాసనసభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయిన బర్రెలక్క అలియాస్ కర్నే శిరీష రెండు తెలుగు రాష్ట్రాలలో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత పెళ్ళి చేసుకొని సాధారణ జీవితం గడుపుతున్న ఆమె మళ్ళీ లోక్‌సభ ఎన్నికలలో నాగర్‌కర్నూల్‌ నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసేందుకు సిద్దపడటం విశేషం. మంగళవారం ఆమె తన కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి లోక్‌సభ అభ్యర్ధిగా నామినేషన్ వేశారు. 

అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, “శాసనసభ ఎన్నికలలో నేను ఓడిపోయి ఉండవచ్చు. కానీ మిగిలిన అభ్యర్ధుల్లా నేను ఒక్క రూపాయి కూడా ఎవరికీ పంచకుండా 5,754 ఓట్లు పొందాను. అంటే అంతమంది ప్రజలు నా నిజాయితీని నమ్మి ఆదరించిన్నట్లే భావిస్తున్నాను. ఆనాడే నేను ఎంపీ ఎన్నికలలో కూడా పోటీ చేస్తానని చెప్పాను. ఆ ప్రకారమే ఇప్పుడు స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్నాను. ప్రజా సమస్యలపై పోరాడుతున్న నన్ను ప్రజలు ఆదరిస్తారనే భావిస్తున్నాను,” అని అన్నారు. 

నాగర్‌కర్నూల్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా మాజీ ఎంపీ మల్లు రవి, బిఆర్ఎస్ అభ్యర్ధిగా మాజీ ఐపిఎస్ అధికారి ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్, బీజేపీ అభ్యర్ధిగా సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు కుమారుడు పి భరత్ ప్రసాద్ పోటీ చేస్తున్నారు. 


Related Post