కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని దింపడానికి అంత సమయం పట్టదు: మోడీ

May 05, 2024


img

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాని నరేంద్రమోడీ కూడా మీడియాకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ప్రముఖ తెలుగు న్యూస్ మీడియా ఈనాడుకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో, తెలంగాణ అభివృద్ధి, కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీల పాలన, రాజకీయాల గురించి తన అభిప్రాయాలు వెల్లడించారు. 

కాంగ్రెస్‌, బిఆర్ఎస్ రెండూ కూడా ప్రజలను మోసం చేసి దోచుకుంటూనే ఉన్నాయి. తెలంగాణ ప్రజలు ఈ విషయం గ్రహించి బిఆర్ఎస్ పార్టీని గద్దె దించడానికి పదేళ్ళు పట్టింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించడానికి బహుశః అంత సమయం పట్టకపోవచ్చు. రెండు పార్టీలలో అవినీతి కామన్. తెలంగాణ రాష్ట్రం దేశానికి గ్రోత్ ఇంజన్ వంటిది. దాని నుంచి భారీగా ఆదాయం సమకూరుతున్నా, కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏమీ ఇవ్వడం లేదంటూ కాంగ్రెస్‌, బిఆర్ఎస్ నేతలు వాదిస్తున్నారు. ఇదివారి చేతగాని తనానికి నిదర్శనం. రాష్ట్ర విభజనకు ముందు ఏపీకి కేంద్రం పన్నుల వాటలో భాగంగా రూ.1,32,384 కోట్లు దక్కితే, విభజన తర్వాత ఏపీకి రూ.2,94,602 కోట్లు, తెలంగాణకు రూ.1,62,288 కోట్లు దక్కాయి. అయినా కేంద్రాన్ని నిందించడం రెండు రాష్ట్రాల నేతలకు పరిపాటిగా మారింది. 

తమ ప్రభుత్వం సాధించిన విజయాల గురించి చెపుతూ, “ఒకప్పుడు నగదు రహిత లావాదేవీలు అంటే అందరూ నవ్వారు. కానీ ఇప్పుడు దేశంలో నగదు లావాదేవీల కంటే నగదు రహిత లావాదేవీలే ఎక్కువగా జరుగుతున్నాయి. ఇది భారత్‌ సాధించిన డిజిటల్ విప్లవమే కదా?ఈ డిజిటల్ ఆర్ధిక వ్యవస్తే దేశంలో కొత్తగా 6 కోట్ల ఉద్యోగాలు సృష్టించింది. అది రాబోయే రోజుల్లో రెట్టింపు కాబోతోంది,” అని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు.  

‘మేకిన్ ఇండియా’ పాలసీని ప్రవేశపెట్టిన తర్వాత దేశంలో గణనీయమైన పారిశ్రామిక ప్రగతి సాధించగలిగాము. ఇప్పుడు ప్రపంచంలో మొబైల్ ఫోన్లు తయారు చేస్తున్న దేశాలలో భారత్‌ రెండో స్థానంలో ఉంది. మారుతున్న ప్రపంచం ఆలోచనా విధానాలు, అవసరాలకు తగ్గట్లుగా మా ప్రభుత్వం ప్రణాళికలు రచించించుకొని, మన దేశంలోని అపారమైన సహజ వనరులు, మానవ వనరులను సమర్ధంగా వినియోగించుకుంటూ ముందుకు సాగుతున్నాము. కనుక ఉద్యోగాల కల్పన పెర్గింది. నిరుద్యోగ సమస్య క్రమంగా తగ్గుతోంది.  

గత ప్రభుత్వాలు క్రీడా రంగం ప్రాధాన్యత గుర్తించకుండా ఉత్తమ ఫలితాలు ఆశించేవి కానీ మా ప్రభుత్వం క్రీడాకారులకు అవసరమైన అన్నీ సమకూర్చడంతో పాటు వారికి మంచి శిక్షణ, పౌష్టికాహారం అందించేందుకు ఏర్పాట్లు, నిపుణులను ఏర్పాటు చేసింది. 

దశాబ్ధాలుగా నిర్లక్ష్యం చేయబడిన మౌలిక సదుపాయాల కల్పనకు మా ప్రభుత్వం చాలా ప్రాధాన్యత ఇస్తూ రూ.11.11 లక్షల కోట్లు ఖర్చు చేసింది. దీని వలన భారత్‌ రూపు రేఖలే మారిపోయాయి. దాంతోపాటు దేశవ్యాప్తంగా పర్యావరణం, పచ్చదనం పెంచడంపై మా ప్రభుత్వం చేసిన కృషికి అప్పుడే సత్ఫలితాలు వస్తున్నాయి,” అని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. 


Related Post