రైతు భరోసా డెడ్‌లైన్‌ మే9: రేవంత్‌ రెడ్డి

April 28, 2024


img

ఓ పక్క బిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీలు అమలుచేయకుండా ప్రజలను మోసం చేస్తోందని ఆరోపిస్తుంటే, సిఎం రేవంత్‌ రెడ్డి తమ పార్టీ ఇచ్చిన ప్రతీ హామీకి కట్టుబడి ఉందని, ఇప్పటికే కొన్నిటిని అమలుచేశామని, మిగిలినవి కూడా అమలుచేస్తామని నిఖచ్చిగా చెపుతున్నారు. 

శనివారం సికింద్రాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో సిఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ, “రైతు భరోసా గురించి బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అడుగుతోంది. కానీ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలలో జమా చేయడం మొదలుపెట్టాము. ఇప్పటి వరకు 65 లక్షల మంది రైతులకు చెల్లించాము. 

ఈ నెల 9వ తేదీలోగా మిగిలిన 4 లక్షల మంది రైతులకు కూడా రూ.7,500 కోట్లు చెల్లించబోతున్నాము. మే 9లోగా మేము రైతు భరోసా హామీని నెరవేరిస్తే ఈ విషయంలో మా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న కేసీఆర్‌ అమర వీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాసి బహిరంగంగా మాకు, ప్రజలకు క్షమాపణ చెప్పేందుకు సిద్దమేనా?” అని సవాలు విసిరారు. 

అలాగే మే 9లోగా ఆసరా పింఛన్లు కూడా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో జమా చేస్తామని చెప్పారు. కొత్తకోట గురుస్వామి సాక్షిగా ఆగస్ట్ 15లోగా అర్హులైన రైతులందరికీ రూ.2 లక్షల రుణాలు కూడా మాఫీ చేస్తామని సిఎం రేవంత్‌ రెడ్డి ప్రమాణం చేశారు. 

తెలంగాణ ప్రజల కోసం తమ ప్రభుత్వం ఇన్ని పధకాలు అమలుచేస్తుంటే, కేసీఆర్‌, మోడీ ఓర్వలేక కత్తులు, గొడ్డళ్ళు తీసుకొని బయలుదేరారని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. తన ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు మోడీ, కేసీఆర్‌ ఎందుకు ఇంత ఆరాటపడుతున్నారని సిఎం రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు.

తెలంగాణ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాల్సిన కేసీఆర్‌ నా ప్రభుత్వాన్ని కూల్చేసి మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోదామని ఆరాటపడుతున్నారని సిఎం రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడక ముందు నుంచే హైదరాబాద్‌ నగరం చాలా అభివృద్ధి చెందిందని, జైపాల్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వంటి కాంగ్రెస్‌ నేతలు హైదరాబాద్‌ మెట్రో, పీవీ ఎక్స్‌ప్రెస్‌, నెక్లెస్ రోడ్ వంటివాటికి అప్పుడే శ్రీకారం చుట్టారని, కాంగ్రెస్‌ హయాంలోనే హైదరాబాద్‌ నగరం పారిశ్రామికంగా ఎంతగానో అభివృద్ధి చెందిందనే విషయం ప్రజలందరికీ తెలుసని సిఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.

నామా నాగేశ్వరరావుని గెలిపిస్తే కేంద్ర మంత్రిని చేస్తానని కేసీఆర్‌ చెపుతున్నారు. ఇంతకీ ఆయన ఏ పార్టీ ద్వారా ఆయనను కేంద్రమంత్రిని చేస్తారో చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఆయనను దరిదాపుల్లోకి కూడా రానీయదు.

కనుక కేంద్రంలో మా ప్రభుత్వం ఏర్పడితే నామాకు ఆ అవకాశం ఉండదు. అంటే లోక్‌సభ ఎన్నికల తర్వాత కేసీఆర్‌ బీజేపీ, ఎన్డీయే కూటమిలో చేరి నామాని కేంద్రమంత్రిని చేస్తారా?చెప్పాలి. 

కేసీఆర్‌ ఇప్పుడు బీజేపీని విమర్శిస్తున్నప్పటికీ, మోడీతో కుమ్మక్కు అయ్యారని చెప్పడానికి ఇంత కంటే మంచి నిదర్శనం ఏముంటుంది? మోడీ, కేసీఆర్‌ ఎల్లప్పుడూ పదవీ అధికారం గురించే ఆలోచిస్తారు తప్ప తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలకు ఉపయోగపడరు.

తెలంగాణ ఏర్పడి పదేళ్ళు అయినా ఇంతవరకు మోడీ ప్రభుత్వం విభజన హామీలు అమలుచేయలేదు. కేసీఆర్‌ని నమ్మి ప్రజలు అధికారం అప్పగితే పదేళ్ళపాటు అందరూ కలిసి రాష్ట్రాన్ని దోచుకుని తిన్నారు. ఇటువంటి పార్టీలు, వాటి అభ్యర్ధులు మనకు అవసరమా?” అని సిఎం రేవంత్‌ రెడ్డి ప్రజలను ప్రశ్నించారు.


Related Post