తెలంగాణ విధ్వంసం జరుగుతోంది: కేసీఆర్‌

May 05, 2024


img

బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ శనివారం మంచిర్యాల జిల్లాలో రోడ్ షో నిర్వహించారు. ఇదివరకు చెప్పిన్నట్లుగానే కేసీఆర్‌ తన విశ్వరూపాన్ని చూపుతూ, రేవంత్‌ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు.

నాలుగు నెలల కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణ పరిస్థితి ఎంత దయనీయంగా మారిపోయిందో వివరిస్తూ, తాను పక్కకు తప్పుకుంటే రాష్ట్రానికి భద్రత లేకుండా పోయిందని అన్నారు. 

తాను తెలంగాణ సమగ్ర వికాసం కోసం పది జిల్లాలను 33గా విభజించి సకల సౌకర్యాలు ప్రజలకు అందుబాటులోకి తెస్తే, ఏమాత్రం దూరదృష్టి లేని ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం మళ్ళీ జిల్లాలను రద్దు చేస్తామంటోందని కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పరిపాలన, ఇచ్చిన హామీలు అమలుపై దృష్టి పెట్టాల్సిన ముఖ్యమంత్రి ఎప్పుడూ తనను తిట్టిపోస్తూ కాలక్షేపం చేస్తున్నారని కేసీఆర్‌ అన్నారు.

మొదట మూడు నెలల్లో ఆరు గ్యారెంటీ పధకాలను అమలుచేస్తామని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ, ఇప్పుడు ఆగస్ట్ 15 అంటూ లోక్‌సభ ఎన్నికలలో కూడా ప్రజలను మభ్యపెడుతోందని కేసీఆర్‌ అన్నారు. 

రేవంత్‌ రెడ్డి దావోస్ వెళ్ళి సింగరేణిని అమ్మేసేందుకు ఆదానీతో మాట్లాడుకొని వచ్చారని కేసీఆర్‌ సంచలన ఆరోపణలు చేశారు. సింగరేణిని పోగొట్టుకుంటే దానిపైనే ఆధారపడి జీవిస్తున్న వేలాది కుటుంబాలురోడ్డున పడతాయని కేసీఆర్‌ అన్నారు.

కనుక సింగరేణిలో మీతో కలిసి 30 ఏళ్ళు కార్మికుడిగా పనిచేసిన కొప్పుల ఈశ్వర్‌ని గెలిపించుకుంటే, ఆయన మీ అందరి కోసం ప్రభుత్వంతో పోరాడుతారని కేసీఆర్‌ అన్నారు. 

ఈ ముఖ్యమంత్రి తన గురించి చాలా అనుచితంగా మాట్లాడుతున్నాడని, జైల్లో పెట్టిస్తానని పదేపదే బెదిరిస్తున్నాడని కానీ తాను ఇలాంటి తాటాకు చప్పుళ్ళకు భయపడబోనని, తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణను కాపాడుకోవడానికి పోరాడుతూనే ఉంటానని కేసీఆర్‌ చెప్పారు.


Related Post