హైదరాబాద్‌ క్రికెట్ అసోసియేషన్‌కు నేడు ఎన్నికలు

October 20, 2023
img

హైదరాబాద్‌ క్రికెట్ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) పాలకమండలిని ఎన్నుకొనేందుకు నేడు ఎన్నికలు జరుగబోతున్నాయి. హెచ్‌సీఏలో మొత్తం 173 మంది సభ్యులున్నారు. వారందరూ నేడు ఉప్పల్ స్టేడియంలో తమ ఓటు హక్కుని వినియోగించుకొని హెచ్ఏసీకి కొత్త పాలక మండలిని ఎన్నుకోబోతున్నారు.

జస్టిస్ ఎల్.నాగేశ్వర రావు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వీఎస్ సంపత్ సమక్షంలో నేడు హెచ్‌సీఏ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. తర్వాత ఓట్లు లెక్కించి వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు. 

ఈ ఎన్నికలలో అర్షనపల్లి జగన్‌ మోహన్ రావు, కె.అనిల్ కుమార్‌, పిఎల్ శ్రీనివాస్, అమర్నాధ్ నలుగురు అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. 

అర్షనపల్లి జగన్‌ నేతృత్వంలో యునైటడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్‌సీఏ ప్యానల్, అనిల్ కుమార్‌ నేతృత్వంలో ఏ హెచ్‌సీఏ గుడ్ గవర్నస్ ప్యానల్, పిఎల్ శ్రీనివాస్ నేతృత్వంలో ది హెచ్‌సీఏ ప్యానల్, అమర్నాధ్ నేతృత్వంలో మరో ప్యానల్ ఈ ఎన్నికలలో పోటీ పడుతున్నాయి. 

హెచ్‌సీఏ ఎన్నికలలో విజయం సాధించాలంటే కనీసం 87 ఓట్లు పొందాల్సి ఉంటుంది. వీరిలో అర్షనపల్లి ప్యానల్‌కు అధికార బిఆర్ఎస్ పార్టీ మద్దతు ఉంది. కనుక ఈ ప్యానల్ విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉందని అందరూ భావిస్తున్నారు. 

Related Post