ఆయనే గడువు పెట్టారు... ఆయనే పొడిగించుకున్నారు పాపం!

March 24, 2026
img

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ దుందుడుకు మాటలు, నిర్ణయాలతో మరోసారి నవ్వుల పాలయ్యారు. ప్రపంచ దేశాల చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని 48 గంటలలో ఇరాన్‌ పూర్తిగా తెరిచి తమకు అప్పగించకపోతే ఇరాన్‌ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలపై దాడులు చేసి నేలమట్టం చేస్తామని ట్రంప్‌ బెదిరించారు. 

కానీ ట్రంప్‌ బెదిరింపులకు ఇరాన్‌ ఏమాత్రం భయపడకపోగా ఒకవేళ తమ మౌలిక వసతులపై అమెరికా దాడులు చేస్తే, తాము కూడా చుట్టు పక్కల గల్ఫ్ దేశాల చమురు క్షేత్రాలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలతో సహా కీలక ప్రదేశాలపై దాడులు చేస్తామని హెచ్చరించింది. దీంతో ఊహించినట్లే ఆయా దేశాలతో పాటు ఇతర దేశాలు కూడా ట్రంప్‌పై తీవ్ర ఒత్తిడి తెచ్చాయి. దీంతో ఇరాన్‌కు 48 గంటలు గడువు విధించిన ట్రంప్‌ స్వయంగా ఆ గడువును 5 రోజులు పొడిగిస్తున్నట్లు ప్రకటించాల్సి వచ్చింది.

అయితే ఇరాన్‌ ప్రతినిధులతో రెండు రోజులుగా ఫలవంతమైన చర్చలు జరుగుతున్నాయని త్వరలో దీనికి పరిష్కారం లభించవచ్చని ట్రంప్‌ చెప్పారు. తన ట్రూత్ సోషల్ మీడియాలో ఓ మెసేజ్ పెట్టారు. అయితే అది ట్రూత్ కాదని అబద్దమని ఇరాన్‌ స్పష్టం చేసింది.

అమెరికాతో తాము ఎటువంటి చర్చలు జరపడం లేదని, కానీ చమురు నష్టాలు తగ్గించేందుకే ట్రంప్‌ ఇలాంటి అబద్దాలు చెపుతున్నారని ఇరాన్‌ స్పష్టం చేసింది. ముందే చెప్పినట్లు ఈ యుద్ధం ముగింపు ట్రంప్‌ చేతిలో లేదని తమ చేతిలోనే ఉందంటూ సోమవారం కూడా గల్ఫ్ దేశాలపై భీకర దాడులు జరిపింది.

కనుక ఇప్పుడు ట్రంప్‌కి ఈ యుద్ధం నుంచి గౌరవప్రదమైన నిష్క్రమణ అవసరం. అది ఎప్పుడో... ఎలాగో... ఎవరి ద్వారా లభిస్తుందో?

Related Post