సిఎం విజయ్‌.. మొదటి మూడు సంతకాలు

May 10, 2026


img

తమిళనాడు సిఎంగా విజయ్‌ నేడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మూడు ఫైల్స్ మీద సంతకాలు చేశారు. టీవీకే పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొని ఎన్నికలలో హామీ ఇచ్చిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా హామీ అమలు చేస్తూ తొలి సంతకం చేశారు. మహిళల రక్షణ కొరకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుకి సంబంధించిన ఫైలుపై రెండో సంతకం చేశారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు యాంటీ డ్రగ్స్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ మూడో ఫైలుపై సంతకం చేశారు. 

విజయ్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చిన వివిధ పార్టీల నేతలు, ప్రముఖులు, ప్రజలు, అభిమానులతో నెహ్రూ ఇండోర్ స్టేడియం కిక్కిరిసిపోయింది. 

వారిని ఉద్దేశ్యించి విజయ్‌ తీవ్ర భావోద్వేగంతో ప్రసంగించారు. “తమిళనాడులో లౌకిక, సామాజిక న్యాయానికి కట్టుబడి పనిచేసే ప్రజా ప్రభుత్వం ఏర్పాటైంది. నేను పేదరికం, ఆకలి, కష్టాలు, కన్నీళ్ళు అన్నీ స్వయంగా అనుభవించాను. కనుక నాకు పేద ప్రజల సమస్యల గురించి బాగా తెలుసు. మీ ఇంట్లో ఓ కుటుంబ సభ్యుడిగా మీ సమస్యలు తీర్చేందుకు చిత్తశుద్ధితో పని చేస్తానని మాటిస్తున్నాను. విద్యార్ధుల కోసం విజయ్‌ మామ అన్ని మంచి పనులే చేస్తాడు. 

గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయింది. కనుక సాధ్యమయ్యేవే చెపుతాం.. చెప్పిందే చేస్తాం. మా ప్రభుత్వంలో ఒకే ఒక్క పవర్ సెంటర్ ఉంటుంది. అది నేనే. మిత్రులైన, రాజకీయ శత్రువులైనా అందరికీ ఒకటే చట్టం... ఒకటే న్యాయం ఉంటుంది. బంధుప్రీతి.. అవినీతికి తావివ్వను...” అని విజయ్‌ ప్రసంగిస్తున్నప్పుడు ప్రతీ మాటకి స్టేడియం చప్పట్లు, ఈలలతో హర్షధ్వానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. 



Related Post