ప్రధాని మోడీ ఈరోజు తెలంగాణ పర్యటనకు వచ్చారు. తెలంగాణలో రూ. 9,377 కోట్లు వ్యయంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేసేందుకే ఈ పర్యటన అనుకోవడానికి లేదు. హెచ్ఐసీసీ వద్ద ప్రారంభోత్సవాల కార్యక్రమం పూర్తయిన తర్వాత హైదరాబాద్‌లో ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు, తర్వాత ఏపీ డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్ళి వారితో భేటీ అవుతారు.
పవన్ కళ్యాణ్ ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకున్నారు కనుక ప్రధాని మోడీ ఆయనని పరామర్శించడం సహజమే. కానీ ప్రధాని హోదాలో ఉన్న మోడీ సిఎం చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి మర్యాద పూర్వకంగా కలిస్తే, భేటీ అయితే ఆశ్చర్యకరమే. ఆలోచించాల్సిన విషయమే. వారి భేటీ రాజకీయం కోసమే అయితే అది తెలంగాణ కోసమేనని అనుమానించాల్సి ఉంటుంది.
ఈరోజు సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ బిజేపి ఆధ్వర్యంలో జరిగే భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొని ప్రసగించబోతున్నారు.
అస్సోం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిలో బిజేపి విజయం సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని మోడీ నేడు తెలంగాణ గడ్డపై ఈ సభలో పాల్గొంటున్నారు. కనుక రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి పనుల గురించి మాట్లాడి, తర్వాత కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనపై విమర్శలు గుప్పించడం ఖాయమే.
అదేవిధంగా పొరుగు రాష్ట్రం ఏపీలో కేంద్రం సహాయసహకారాలతో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి కూడా వివరించి, తెలంగాణలో కూడా మరింత వేగంగా అభివృద్ధి జరగాలంటే బిజేపి అధికారంలోకి రావడం అవసరమని ప్రధాని మోడీ చెప్పే అవకాశం ఉంది. కనుక ప్రధాని మోడీ పర్యటనలో రాజకీయ ప్రాధాన్యత కూడా ఎక్కువ కనిపిస్తోంది.
తెలంగాణ బిజేపి అధ్యక్షుడు రాంచందర్ రావు మొన్న మీడియాతో మాట్లాడుతూ, “ప్రధాని మోడీ పర్యటన తర్వాత రాష్ట్ర రాజకీయాలలో మార్పులు జరుగుతాయి,” అని అన్నారు. కనుక ఆ మార్పుకి నేడు శ్రీకారం చుట్టబోతున్నారా? త్వరలో తెలుస్తుంది.