బిజేపి తదుపరి లక్ష్యం తెలంగాణయే: ఈటల

May 08, 2026


img

బిజేపికి కొరకరాని కొయ్యవంటి ఆమాద్మీ పార్టీని, ప్రభుత్వాన్ని ఎలాగో కొరికేసింది. అలాగే ఒడిస్సాలోని నవీన్ పట్నాయక్‌ ప్రభుత్వాన్ని కొరికేసి దించేసింది. తాజాగా పశ్చిమ బెంగాలలోని తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీని కూడా కొరికేసి భారీ మెజార్టీతో అధికారంలోకి రాబోతోంది. కనుక బిజేపి తదుపరి లక్ష్యం తెలంగాణ రాష్ట్రమేనని రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, కేంద్ర మంత్రి బండి సంజయ్‌, తాజాగా ఎంపీ ఈటల రాజేందర్ కూడా చెప్పేశారు. 

గజ్వేల్ నియోజకవర్గంలోని కార్యకర్తలని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “పశ్చిమ బెంగాల్, తమిళనాడులో కుటుంబ పాలనని ప్రజలు తిరస్కరించారు. డబ్బు వెదజల్లి, గూండాయిజం చేసి ప్రజలను భయపెట్టి అధికారంలోకి రావాలనుకున్న కేసీఆర్‌, మమతా బెనర్జీ వంటివారిని ప్రజలు తిరస్కరించి ఆటో డ్రైవర్లు, సాధారణ వ్యక్తులను ఎన్నుకున్నారు. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీకి, తమిళనాడులో డీఎంకే పార్టీకి బలమైన క్యాడర్, చేతి నిండా డబ్బు, అధికార యంత్రాంగం ఉంది. కానీ అవేమీ లేని విజయ్‌ పోటీ చేస్తే ప్రజలు గెలిపించారు. కనుక డబ్బుతో అధికారం కొనలేమని ఆ పార్టీలు గ్రహిస్తే మంచిది,” అని అన్నారు.

ఎన్నికలలో విజయం సాధించిన తర్వాత ప్రధాని మోడీ తొలిసారిగా హైదరాబాద్‌ వస్తున్నారు. ఈ నెల 10న సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్ లో జరుగబోయే భారీ బహిరంగ సభలో పాల్గొన్నప్పుడు ప్రధాని మోడీ కూడా తమ తదుపరి లక్ష్యం తెలంగాణ రాష్ట్రమే అని చెప్పేస్తే ఇక రాష్ట్రంలో అధికార కాంగ్రెస్‌, బిజేపి, బీఆర్ఎస్‌ మూడు పార్టీల మద్య యుద్ధాలు మొదలైపోతాయి.


Related Post