కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరధ్ పై షేక్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదవడంపై స్పందిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. “నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక కొందరు నా పిల్లలను, కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగుతున్నారు. ఇది వారిలో గూడుకట్టుకున్న నిరాశ నిస్పృహలకు అద్దం పడుతుంది, అంటూ తన ప్రత్యర్ధులు చేసిన రాజకీయ కుట్రగా అభివర్ణించారు. బండి సంజయ్ ఏమన్నారో ఆయన మాటల్లోనే...
“నిరాధారమైన ఆరోపణలు వెలుగు చూసిన నేపథ్యంలో ఈ ప్రకటన నాకు చట్టంపై గౌరవం, న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంది. జీవితాంతం భారత రాజ్యాంగానికి కట్టుబడే ఉన్నాను. దశాబ్దాలుగా ప్రజలతోనే ఉన్న నేను మచ్చ లేని జీవితం గడిపానని గర్వంగా చెప్పగలను.
నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక కొందరు నా పిల్లలను, కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగుతున్నారు. ఇది వారిలో గూడుకట్టుకున్న నిరాశ నిస్పృహలకు అద్దం పడుతుంది.
అట్టడుగు స్థాయి నుంచే నా ప్రజా జీవితాన్ని మొదలుపెట్టాను. కష్టపడి పనిచేసి ప్రజల ఆశీర్వాదంతో నాడు కార్పొరేటర్ గా, నేడు ఎంపీగా ఎన్నికై, కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వెనకబడి వర్గాలకు చెందిన బీసీ వ్యక్తి, నాయకుడిగా కేంద్రమంత్రి స్థాయికి ఎదగడాన్ని కొన్ని శక్తులు జీర్ణించుకోలేక కుట్రలకు తెరతీశాయి. రేపు గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీగారి బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో నన్ను వ్యక్తిగతంగా అప్రతిష్టపాలు చేయాలన్నదే ఆ కుట్రల వెనకున్న అసలు లక్ష్యం.
తప్పేదో.. ఒప్పేదో.. న్యాయవ్యవస్థ నిర్ణయిస్తుందన్న నమ్మకం నాకుంది. సమయం ప్రతి ఆరోపణకు సమాధానం ఇస్తుంది, ప్రతి కుట్రను బహిర్గతం చేస్తుంది. సత్యమేవ జయతే!”