బండి సంజయ్‌కి సన్ స్ట్రోక్.. పోక్సో కేసు నమోదు!

May 10, 2026
img

తెలంగాణ బిజేపి ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌కి సన్ స్ట్రోక్ తగిలింది. అంటే వడదెబ్బ కాదు. కొడుకు భగీరధ్ వలన చిక్కులో పడ్డారు. అతనిపై షేక్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదైంది. హైదరాబాద్‌ సుచిత్రక్రాస్ రోడ్స్ వద్ద నివసిస్తున్న ఓ మైనర్ బాలిక (17)  తల్లితండ్రులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వచ్చి బండి భగీరధ్ తనను వేధిస్తున్నాడని పిర్యాదు చేసింది. 

పోలీసులు సెక్షన్ 11 రెడ్ విత్ పోక్సో యాక్ట్ 12, బీఎన్ఎస్ సెక్షన్స్  74, 75 కింద కేసు నమోదు చేశారు. ఆమె పిర్యాదు ప్రకారం, గత ఏడాది అక్టోబర్‌లో అతను తనని మాయమాటలతో మభ్యపెట్టి నానాక్‌రాంగూడలోని ఓ అపార్ట్‌మెంట్‌కి తీసుకువెళ్ళి అసభ్యంగా ప్రవర్తించాడని పేర్కొంది.

మళ్ళీ గత డిసెంబర్‌ 31న న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసమని చెప్పి తనని మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌసుకు తీసుకువెళ్ళి బలవంతంగా మద్యం తాగించాడని పేర్కొంది. అక్కడా అసభ్యంగా వ్యవహరిస్తుంటే తప్పించుకొని పారిపోయి ఇంటికి చేరుకున్నానని పేర్కొంది. అ తర్వాత తన ఇంటి వద్ద కాపు కాసి పలుమార్లు వేధించాడని ఆ బాలిక పిర్యాదులో పేర్కొంది. ఆమె మైనర్ కనుక పోలీసులు ఆ బాలికని భరోసా కేంద్రానికి తరలించి వాంగ్మూలం తీసుకోబోతున్నారు. 

అయితే ఆ బాలిక తల్లి కూతురు పేరుతో తనని రూ.5 కోట్లు ఇవ్వాలంటూ బ్లాక్ మెయిల్ చేస్తోందని భగీరధ్ కూడా కరీంనగర్‌ పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశాడు. ఆమె తమ కుటుంబంలో జరిగే శుభకార్యాలకు వచ్చేదని, తమ కుటుంబంతో కలిసి తీర్ధయాత్రలు, విహార యాత్రలకు కూడా వచ్చేదని భగీరధ్ పేర్కొన్నాడు. 

ఆ పరిచయంతో ఆమె తల్లి  తన కూతురుని వివాహం చేసుకోవాలని బలవంతం పెట్టేదని లేకుంటే తప్పుడు కేసు పెడతానని బెదిరించేదని భగీరధ్ తన పిర్యాదులో పేర్కొన్నాడు. ఆమె ఒత్తిడి భరించలేక ఒకసారి రూ.50,000 ఇచ్చానని, అప్పటి నుంచి ఆమె రూ. 5 కోట్లు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టిందని భగీరధ్ పేర్కొన్నాడు. పోలీసులు ఆ బాలిక తల్లిపై కేసు  నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Related Post