స్పింటర్ హిమదాస్‌కు డిఎస్పీ ఉద్యోగం ఇచ్చిన అస్సాం ప్రభుత్వం

February 28, 2021
img

ఇండియా స్ప్రిoటర్ హిమదాస్‌కు అస్సాం రాష్ట్ర ప్రభుత్వం డిఎస్పిగా ఉద్యోగం ఇచ్చి ఘనంగా సత్కరించింది. అస్సాం ముఖ్యమంత్రి సర్బనంద సోనోయల్, అస్సాం అదనపు డిజిపి హర్మీత్ సింగ్‌ శుక్రవారం గౌహతీలోఘనంగా సత్కరించి ఆమెకు అస్సాం పోలీస్ శాఖలో డిఎస్పిగా నియామకపత్రం అందజేసారు. 


హిమదాస్ అస్సాంలోని నాగావ్ జిల్లాలోని డింగ్‌ అనే మారుమూల గ్రామంలో జన్మించారు. చిన్నప్పటినుండి పరుగుల పోటీలలో చాలా ఉత్సాహంగా పాల్గొనేవారు. అలా ప్రయాణం ప్రారంభించి పరుగుల పోటీలలో అంతర్జాతీయ స్థాయిలో హిమదాస్ పేరొందారు. 

అస్సాం రాజధాని గౌహతిలో 2018లో సం.లో జరిగిన అంతర్ రాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలో ఆమె 400 మీటర్ల దూరాన్ని కేవలం 51.13 సెకన్లలో అధిగమించి రికార్డును సృష్టించారు. అదే సంవత్సరంలో ఫిన్లాండ్‌లో టంపెరి నగరంలో జరిగిన అంతర్జాతీయ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ అండర్-20 ఫైనల్లో 400 పరుగుల మీటర్ల లక్ష్యాన్ని 51.46 సెకండ్లలోనే అధిగమించి గోల్డ్ మెడల్ సాధించారు. హిమదాస్ ప్రపంచ అథ్లెటిక్ చరిత్రలో గోల్డ్ మెడల్ సాధించిన మొదటి భారతీయ మహిళా అథ్లెటిక్‌గా చరిత్ర సృష్టించారు. భారత ప్రభుత్వం హిమాదాస్‌కు 2018 సం.లో అర్జున అవార్డుతో సత్కరించినా సంగతి తెలిసిందే. అంతర్జాతీయ ట్రాక్ మీద పరుగు ప్రారంభించిన ఆమె కేవలం 18 నెలల వ్యవధిలోనే తన లక్ష్యాన్ని సాధించి భారత్‌కు పేరు తెచ్చారు. గోల్డ్ మెడల్ సాధించినప్పటికీ నేటికీ ఆమె పరుగుల ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. 

ఈ సందర్భంగా హిమదాస్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ డీఎస్పీ హోదా ఇచ్చినందుకు చాలా ఆనందంగానూ, గర్వంగాను ఉందన్నారు. తనకు డీఎస్పీ హోదా వస్తుందని కలలో కూడా ఊహించలేదన్నారు. తాను ఈ స్థాయికి చేరుకొనేందుకు తనను తీర్చిదిద్దిన కోచ్‌లకు, ఈ పరుగుల ప్రస్థానంలో సహకరించిన వారందరికీ హిమదాస్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆమె అస్సాం ముఖ్యమంత్రికి, కేంద్ర క్రీడలశాఖమంత్రి కిరణ్ రిజ్జు తదితరులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకున్నారు.


Related Post