కవిత, కేజ్రీవాల్‌ ఇద్దరికీ మరో రెండు వారాలు రిమాండ్‌

April 23, 2024


img

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మార్చి 15న అరెస్ట్అయిన బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకి నేడు రౌస్ అవెన్యూ కోర్టులో మరోసారి నిరాశ ఎదురైంది. ఆమె బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి కావేరీ బవేజా సీబీఐ వాదనలతో ఏకీభవిస్తూ ఆమెకు, ఆమెతో పాటు ఇదే కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్‌కు ఇద్దరికీ మరో 14 రోజులపాటు జ్యూడిషియల్ రిమాండ్‌ పొడిగిస్తున్నట్లు తీర్పు చెప్పారు.

దీంతో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు కల్వకుంట్ల కవిత బయటకు వచ్చే పరిస్థితి కనపడటం లేదు. ఈ కేసులో నిందితుడు, కల్వకుంట్ల కవిత వలన భాధితుడు శరత్ చంద్రారెడ్డి అప్రూవరుగా మారిన సంగతి తెలిసిందే. 

ఆమె శరత్ చంద్రారెడ్డిని బెదిరించి రూ.14.80 కోట్లు బలవంతంగా వసూలు చేశారని సీబీఐ రిమాండ్‌ రిపోర్టులో పేర్కొంది. దీనిని ఆయన కూడా ధృవీకరించడంతో ఇప్పుడు బెయిల్‌ దొరకడం కష్టంగా మారిన్నట్లు కనిపిస్తోంది.

అయితే ఈ కేసులో ఆమెను ఇక ప్రశ్నించాల్సింది ఏమీ లేదని సీబీఐ స్వయంగా కోర్టులో చెప్పినప్పటికీ ఆమె బెయిల్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ కేసులో అప్రూవర్లుగా మారిన శరత్ చంద్రా రెడ్డి ఇంకా పలువురు బెయిల్‌ పొంది బయటే ఉన్నందున ఆమెకు బెయిల్‌ మంజూరు చేస్తే వారిని ప్రభావితం చేస్తారు కనుక జ్యూడిషియల్ రిమాండ్‌ పొడిగించాలని సీబీఐ వాదిస్తోంది.

సీబీఐ వాదనలతో కీభవించిఒన రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజా కల్వకుంట్ల కవిత, అర్వింద్ కేజ్రీవాల్‌ జ్యూడిషియల్ రిమాండ్‌ 14 రోజుల పాటు పొడిగించి, వారిద్దరినీ మే 7వ తేదీన కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు. 


Related Post