ఆ 108 మంది ఉద్యోగుల సస్పెన్షన్‌పై హైకోర్టు స్టే

April 20, 2024


img

సిద్ధిపేట జిల్లాలో సస్పెన్షన్‌ వేటు పడిన 108 మంది సెర్ఫ్ (సొసైటీ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్‌ సర్వీసస్) ఉద్యోగులకు హైకోర్టులో ఉపశమనం లభించింది. వారిపై జిల్లా కలెక్టర్ విధించిన సస్పెన్షన్‌పై హైకోర్టు స్టే విధిస్తూ శనివారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 

మెదక్ బిఆర్ఎస్‌ అభ్యర్ధి వెంకట్రామిరెడ్డి సిద్ధిపేటలో నిర్వహించి బిఆర్ఎస్‌ పార్టీ సమావేశానికి 108 మంది సెర్ఫ్ ఉద్యోగులు కూడా హాజరయ్యారు. ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటూ బిఆర్ఎస్‌ పార్టీ కార్యక్రమంలో పాల్గొనడంపై మెదక్ బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్‌ని కలిసి అభ్యంతరం చెప్పారు.

వెంటనే కలెక్టర్ వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తమని సస్పెండ్ చేయడంపై అభ్యంతరం తెలుపుతూ ముగ్గురు సెర్ఫ్ ఉద్యోగులు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. వారి తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం, ఉద్యోగుల సస్పెన్షన్‌పై స్టే విధించింది.

ఈ కేసు తదుపరి విచారణను జూన్ 26కి వాయిదా వేసింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ నోటీస్ జారీ చేసింది.


Related Post