రేపు ఢిల్లీ పోలీసుల ఎదుట సిఎం రేవంత్‌ హాజరు?

April 30, 2024


img

సిఎం రేవంత్‌ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీస్ అందజేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముస్లింల రిజర్వేషన్ రద్దు చేసి వాటిని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వర్తింపజేస్తామని చెప్పగా, ఆయన మాటలను సిఎం రేవంత్‌ రెడ్డి వక్రీకరించి బీజేపీ మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు మొత్తం ఎత్తివేస్తుందని ఎన్నికల ప్రచార సభలో చెప్పారు.

కాంగ్రెస్‌ సోషల్ మీడియా విభాగం కూడా అమిత్ షా ప్రసంగ వీడియోని ఎడిట్ చేసి రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పిన్నట్లు మార్చి వైరల్ చేశారు. 

దీనిపై బీజేపీ, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారులు ఢిల్లీలోని ద్వారాక సెక్టర్‌లోని ప్రత్యేక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారి పిర్యాదు ప్రకారం కేసు నమోదు చేసుకొని, హైదరాబాద్‌ వచ్చి గాంధీ భవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్‌ లీగల్ సెల్ ఇన్‌చార్జి రామచంద్రా రెడ్డికి అందజేశారు. 

సిఎం రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ సోషల్ మీడియా ఛైర్మన్‌ మన్నే సతీష్, కొ-ఆర్డినేటర్ నవీన్, పిసిసి కార్యదర్శి శివకుమార్, కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అస్మా తస్లీంలకు ఇన్‌స్పెక్టర్ నీరజ్ చౌదరి పేరుతో నోటీస్ అందజేశారు.  

మే 1వ తేదీ ఉదయం 10.30 గంటలకు ఢిల్లీలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరై రిజర్వేషన్స్ రద్దుపై చెప్పిన మాటలపై సంజాయిషీ ఇచ్చుకోవాలని నోటీసులో సూచించారు. ఒకవేళ విచారణకు హాజరు కాకపోతే సెక్షన్ 91/160 కింద క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు చేపడతామని నోటీసులో పేర్కొన్నారు.     

కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాటలను వక్రీకరిస్తూ ఎడిట్ చేయడానికి ఉపయోగించిన ఫోన్ లేదా ల్యాప్ టాప్ లేదా ట్యాబ్‌లెట్‌ను కూడా తప్పనిసరిగా వెంట తీసుకురావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. 

ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం సిఎం రేవంత్‌ రెడ్డి మీదే కేసు నమోదు చేయించి ఢిల్లీకి రప్పిస్తుండటం కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ 10-12 ఎంపీ సీట్లు గెలుచుకోగలదని సర్వేలు సూచిస్తున్నప్పుడు, సిఎం రేవంత్‌ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు అందజేయడం కుట్రే అని కాంగ్రెస్‌ నేతలు వాదిస్తున్నారు.


Related Post