ఫ్యూచర్ సిటీలో స్పోర్ట్స్ యూనివర్సిటీ... మంచి ఆలోచనే!

August 18, 2024
img

తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి బృందం దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నప్పుడే ఒలింపిక్స్‌ పోటీలలో ఆ దేశపు క్రీడాకారులు 32 పతకాలు సాధించారు. వాటిలో సగం కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో శిక్షణ పొందిన క్రీడాకారులవే. ఇది గమనించిన రేవంత్‌ రెడ్డి బృందం వారి క్రీడా విశ్వవిద్యాలయాన్ని కూడా సందర్శించి అది పనిచేసే విధానం గురించి తెలుసుకున్నారు. 

భారత్‌లో కూడా వివిద క్రీడలలో శిక్షణ ఇచ్చేందుకుగాను వేర్వేరుగా జాతీయ, రాష్ట్ర స్థాయి సంస్థలు ఉన్నప్పటికీ ఈవిదంగా అన్ని రకాల క్రీడలలో శిక్షణ ఇచ్చే విశ్వవిద్యాలయం తెలంగాణ రాష్ట్రంలో ఒక్కటి కూడా లేదు. కనుక రాష్ట్ర ప్రభుత్వం 'యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ'ని ప్రతిపాదించింది. 

హైదరాబాద్‌ శివార్లలో కొత్తగా నిర్మించబోతున్న కొత్త నగరంలో ఈ క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని సిఎం రేవంత్‌ రెడ్డి నిర్ణయించారు. దీని కోసం హకీంపేటలో గల స్పోర్ట్స్ స్కూల్, గచ్చిబౌలిలో స్టేడియంలను అధికారులు పరిశీలిస్తున్నారు. 

ఇక్కడ సకల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి కనుక వీటిలో ఏదో ఒకటి తీసుకొని అప్‌గ్రేడ్ చేస్తే తక్కువ ఖర్చుతో త్వరగా క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయగలుగుతామని అధికారులు సిఎం రేవంత్‌ రెడ్డికి సూచించిన్నట్లు తెలుస్తోంది. 

కొత్తగా ఏర్పాటు చేయబోయే ఈ క్రీడా విశ్వవిద్యాలయంలో కొరియన్ యూనివర్సిటీతో సహా అమెరికా వంటి అగ్రదేశాలలోని ఇటువంటి యూనివర్సిటీలను కూడా భాగస్వాములుగా చేసుకునే ఆలోచన కూడా ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే వచ్చే ఒలింపిక్స్‌ పోటీలకు భారత్‌ నుంచి మెరికాల్లాంటి క్రీడాకారులను తయారుచేసి పంపించవచ్చు.  

Related Post