నిన్న జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్ధిగా పోటీ చేసిన సీపీ రాధాకృష్ణన్ ఘన విజయం సాధించారు. ఇండియా కూటమి అభ్యర్ధి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
మొత్తం 767 మంది ఎంపీలలో 452 మంది సీపీ రాధాకృష్ణన్‌కి ఓట్లు వేయగా, 300 మంది జస్టిస్ సుదర్శన్ రెడ్డికి వేశారు. కనుక ఎన్డీఏ అభ్యర్ధి సీపీ రాధాకృష్ణన్ ఉప రాష్ట్రపతిగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటించారు.
ఆనంతరం కేంద్ర మంత్రి ప్రహ్లాద జోషి నివాసంలో జరిగిన తేనీటి విందులో పాల్గొన్న ఆయనని ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు తదితరులు అభినందించారు. తనను అభ్యర్ధిగా ఎంపిక చేసి గెలిపించి ఈ పదవి కట్టబెట్టినందుకు ఆయన ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు.
కౌంటింగ్ ముగిసిన తర్వాత జస్టిస్ సుదర్శన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “ప్రజాస్వామ్య బద్దంగా జరిగిన ఈ ఎన్నికలో నా ఓటమిని వినమ్రంగా అంగీకరిస్తున్నాను. ఈ ఎన్నికలో పోటీ చేసే అవకాశం లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయలు, వాటి వ్యక్తీకరించేందుకు ఇటువంటి వ్యవస్థలు, ప్రక్రియలు చాలా అవసరం. ఇటువంటివే మన ప్రజాస్వామ్య వ్యవస్థకు బలమైన పునాదిగా నిలుస్తాయి. నాకీ అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీకి, ఇండియా కూటమి మిత్రపక్షాలకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపు కుంటున్నాను,” అంటూ జస్టిస్ సుదర్శన్ రెడ్డి తన ఓటమిపై చాలా హుందాగా స్పందించారు.
ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్ నేడు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత రాజ్యసభ ఛైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేస్తారు.