మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఈరోజు సకుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు.
బయట మీడియాతో మాట్లాడుతూ, “ఏటా మేము తిరుమల వెంకన్న దర్శనానికి వస్తుంటాము. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నాము. నేడు అడిగినవి, అడగని కోర్కెలని కూడా స్వామివారు తీర్చారు. కనుక కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాను,” అని అన్నారు.
కేసీఆర్ హయంలో అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనతో నాశనం అయిపోయింది. చివరికి రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి కూడా క్రమంగా దిగజారుతోంది.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీలో భూములు అమ్ముకొని తెలంగాణలో కొనుకునేవారు. ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ఏపీని శరవేగంగా అభివృద్ధి చేస్తున్నందున ఇప్పుడు తెలంగాణలో భూములు అమ్ముకొని ఏపీలో కొనుక్కునే పరిస్థితి నెలకొంది. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాలలో శరవేగంగా అభివృద్ధి చేస్తున్నారు.
నాడు కేటీఆర్ తెలంగాణకి లక్షల కోట్ల పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకువచ్చి లక్షలాది మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించారు. ఇప్పుడు పరిశ్రమలు, పెట్టుబడులు అన్నీ ఏపీకి క్యూ కడుతున్నాయి. కనుక తెలంగాణ ఎదుర్కొంటున్న ఈ సమస్యలకు ఏకైక పరిష్కారం కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావడమేనని భావిస్తున్నాను. అందుకే కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకొన్నాను,” అని మల్లారెడ్డి అన్నారు.