గ్రూప్-1 ఫలితాలపై హైకోర్టు అర్హత సాధించిన అభ్యర్ధులకు, టిజీపీఎస్సీకి పెద్ద షాక్ ఇచ్చింది. ఈ ఏడాది మార్చి 10న వెలువడిన ఫలితాల ఆధారంగాటిజీపీఎస్సీ జారీ చేసిన జనరల్ ర్యాంకింగ్ లిస్టు, మార్కుల జాబితా రెండింటినీ హైకోర్టు రద్దు చేసింది.
వాటి మూల్యంకనంలో చాలా అవకతవకలు జరిగాయని కనుక పరీక్షలనే రద్దు చేయాలని కోరుతూ కొందరు అభ్యర్ధులు హైకోర్టుని ఆశ్రయించారు. కానీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చివరి దశకు చేరుకున్నప్పుడు ఆవిధంగా చేయరాదంటూ మరికొందరు హైకోర్టుని ఆశ్రయించారు.
జస్టిస్ నామవరపు రాజేశ్వర రావు జూలై 7న ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత తీర్పుని రిజర్వ్ చేసి నేడు తుది తీర్పు ప్రకటించారు. సంజయ్ వర్సస్ యూపీఎస్సీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం మళ్ళీ మూల్యాంకనం జరపాలని, ఈ భర్తీ ప్రక్రియని 8 నెలల్లోగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఒకవేళ ఈ ప్రక్రియ నిర్దిష్ట గడువులోగా పూర్తిచేయకపోతే మెయిన్ పరీక్షలని రద్దు చేయవలసి వస్తుందని కూడా హెచ్చారించారు.
ఇక నేడో రేపో ఉద్యోగ నియామక పత్రాలు చేతికి అందుతాయని ఆత్రుత్రగా ఎదురుచూస్తున్న మెరిట్ అభ్యర్ధులకు హైకోర్టు తాజా తీర్పు తీవ్ర నిరాశ నిస్పృహలు కలిగించక మానదు.