రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తునందుకు 50 శాతం సుంకాలు విధించడమే కాక మరో 50 శాతం విధిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. భారత్, రష్యా ఆర్ధిక వ్యవస్థలు చచ్చిన ఆర్ధిక వ్యవస్థలని వాటిని తాను పట్టించుకోనన్నారు. ప్రధాని మోడీ చైనా, రష్యా అధ్యక్షులతో భేటీ అవడంపై కూడా ట్రంప్ నిప్పులు చెరిగారు. చైనా చీకటి వలయంలో భారత్ చిక్కుకుందని ఎద్దేవా చేశారు.
ఇన్ని మాటలు మాట్లాడిన ట్రంప్, ఇప్పుడు ప్రధాని మోడీ తనకు మంచి మిత్రుడని త్వరలోనే ఆయనతో భేటీ అయ్యేందుకు ఎదురుచూస్తున్నానని అన్నారు. వాణిజ్య ఒప్పందాలపై ఇరుదేశాల మద్య చర్చలు కొనసాగుతున్నాయని త్వరలోనే ఈ సమస్యలకు సరైన పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నానన్నారు. ఈ మేరకు తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
భారత్‌ని దూరం చేసుకుంటే ఆమెరికాకే నష్టమని ట్రంప్ గ్రహించినట్లే ఉన్నారు. ముఖ్యంగా చైనా, రష్యాలకు భారత్ దగ్గరై ఆ మూడు దేశాలు కూటమిగా ఏర్పడితే అమెరికాకు ధీటుగా బలమైన శక్తిగా మారుతాయని ట్రంప్ గ్రహించినట్లే ఉన్నారు. అందుకే ఆయన స్వరం మారిందనుకోవచ్చు. కనుక భారత్‌ని ఆకర్షించేందుకు బహుశః సుంకాలు తగ్గిస్తారేమో? ట్రంప్‌లో ఈ మార్పు భారత్ ఎగుమతులకు శుభపరిణామమే.