వెనిజులా ఆక్రమణకి ట్రంప్‌ కుట్ర?

September 07, 2025


img

అపారమైన చమురు నిలువలు కలిగిన వెనిజులాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కన్ను చాలా కాలంగానే ఉంది. కనుక వెనిజులాని ఏదో వంకతో అమెరికా అధీనంలోకి తెచ్చుకుంటే కావలసినంత చమురు తోడేసుకోవచ్చు.

అలాగే ప్రపంచ చమురు మార్కెట్‌ని శాశించవచ్చని భావిస్తున్నట్లున్నారు. కానీ ఈ మాట పైకి చెప్పలేరు కనుక వెనిజులా నుంచి తమ దేశానికి మాదక ద్రవ్యాల బెడద బాగా ఎక్కువైపోయిందని చెపుతున్నారు. 

ఈ మాదక ద్రవ్యాల ముఠాలకు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోకి బలమైన సంబందాలున్నాయని ట్రంప్‌ ప్రభుత్వం ఆరోపిస్తోంది. కనుక ఆయనని పట్టిస్తే 50 మిలియన్ డాలర్లు (భారతీయ కరెన్సీలో రూ.430 కోట్లు) బహుమతి కూడా ప్రకటించింది. అంటే ట్రంప్‌ టార్గెట్‌ వెనిజులా అధ్యక్షుడన్న మాట. ఒక దేశాధ్యక్షుడుని టార్గెట్ చేయడం అంటే ఆ దేశాన్ని తన అధీనంలో తెచ్చుకునే ప్రయత్నమే అని వేరే చెప్పక్కరలేదు.  

వెనిజులాలోని ఆ మాదక ద్రవ్యాల ముఠాలను నిర్మూలించేందుకు అంటూ ట్రంప్‌ అత్యాధునిక యుద్ధ విమానాలతో కూడిన అనేక యుద్ధ నౌకలను, బాంబులు వర్షం కురిపించగల జలాంతర్గాములను వెనిజులాకి పంపించారు.

అవన్నీ వెనిజులా సమీపంలో కరేబియన్ సముద్రంలో మొహరించి దాడికి సిద్దంగా ఉన్నాయి. కనుక ఏడు యుద్ధాలు ఆపినందుకు తనకు నోబుల్ శాంతి బహుమతి ఇవ్వాల్సిందే అని పట్టుపడుతున్న ట్రంప్‌ 8వ యుద్ధం స్వయంగా ప్రారంభించబోతుండటం విశేషం.


Related Post