బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కూడా ఒకరు. అయనకు సిఎం రేవంత్ రెడ్డి స్వయంగా కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి తీసుకున్నారు. అయితే పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వారిని సంజాయిషీ కోరుతూ నోటీసులు పంపారు.
అలా నోటీస్ అందుకున్నవారిలో కృష్ణమోహన్ రెడ్డి కూడా ఒకరు. కనుక ఆయన స్పీకర్‌కి లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “నేటికీ నేను బీఆర్ఎస్ పార్టీ సభ్యుడుగానే ఉన్నాను. మా పార్టీ అధినేత కేసీఆర్‌ని నేను చాలా గౌరవిస్తాను. అయితే నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే అధికార పార్టీ తోడ్పాటు చాలా అవసరం. కనుక సిఎం రేవంత్ రెడ్డి సాయంతో నా నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తున్నాను. కానీ ఓ శాసనసభ్యుడుగా నేను సుప్రీంకోర్టుని, స్పీకర్‌ని గౌరవించాలి. కనుక ఆయనను కలిసి లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చాను,” అని చెప్పారు.
కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి వంటి ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మాత్రం తాము ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేసి ఉప ఎన్నికలలో పోటీ చేసేందుకు సిద్దమని చెపుతున్నారు. కానీ కృష్ణమోహన్ రెడ్డి వంటి కొందరు తెలివిగా తాము నేటికీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని, ఆ పార్టీ ఎమ్మెల్యేలమని చెప్పి అనర్హత వేటు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.