ఒకప్పుడు సోషల్ మీడియాని ముఖ్యమైన వివరాలు, సందేశాలు ఇవ్వడానికి ఉపయోగించేవారు. కానీ రాజకీయ పార్టీలు సోషల్ మీడియాలో ప్రవేశించాక అది పరస్పరం విమర్శలు చేసుకోవడానికి, దుష్ప్రచారం చేయడానికి, వ్యక్తిగత దూషణలకు, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఎక్కువగా వాడుతున్నారు.
కనుక సోషల్ మీడియాలో అసభ్య లేదా అనుచిత పోస్టులు పెడుతున్నవారిపై కేసులు కూడా నమోదు అవుతూనే ఉన్నాయి. ఈ విషయంలో తెలంగాణ హైకోర్టు పోలీసులకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది.
1. కేసులు నమోదు చేసే ముందు తప్పనిసరిగా ప్రాధమిక విచారణ జరపాలి.
2. యాంత్రికంగా కేసులు నమోదు చేయరాదు. అరెస్టులు చేయరాదు.
3. రాజకీయ విద్వేష పోస్టులు పెట్టినవారిపై కేసు నమోదు చేసే ముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సలహా తీసుకోవాలి.
4. ప్రాధమిక విచారణలో ద్వేష పూరిత ప్రసంగాలు, హింసను ప్రేరేపించడం, శాంతి భద్రతలకు భంగం కలిగించడం, ఇతరుల పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నట్లు ఆధారాలు ఉంటేనే కేసులు నమోదు చేయాలి.
5. రాజకీయ విమర్శలపై కేసులు నమోదు చేయరాదు.
6. పరువు నష్టం కేసులో పోలీసులు నేరుగా ఎఫ్ఐఆర్ నమోదు చేయరాదు. మేజిస్ట్రేట్ ఉత్తర్వులు తప్పనిసరి.
7. ఇతరుల తరపున చేసిన పిర్యాదులు విచారణార్హం కావు.
8. రాజకీయ ప్రేరేపిత పిర్యాదులను స్వీకరించరాదు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయరాదు. ఒకవేళ కేసు నమోదు చేసి ఉంటే మూసివేయవచ్చు.