తెలుగు సినీ పరిశ్రమకి సంక్రాంతి పండగ సీజన్ చాలా ప్రత్యేకం. ఎందుకంటే, ఆ సీజనులో సినిమా వదిలితే కాస్త యావరేజ్‌గా ఉన్నా సరే కలెక్షన్స్ కనకవర్షం కురుస్తుంటుంది కనుక!
ఈసారి 2026 సంక్రాంతికి దాదాపు అరడజను సినిమాలు సిద్దంగా ఉన్నాయి. వాటిలో ముందుగా చెప్పుకోవలసింది ‘మన శంకరవర ప్రసాద్ గారు.’
గత ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ అని ముందే చెప్పి వచ్చి హిట్ కొట్టిన దర్శకుడు అనిల్ రావిపూడి, ఈసారి కూడా పండగకే వస్తున్నామని చెప్పేశారు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు విక్టరీ వేకటేష్ కూడా ఉన్నారు. కనుక ఇక చూసుకోనవసరం లేదు.
ఇక ‘రాజాసాబ్’ కూడా సంక్రాంతికే రావాలనుకుంటున్నారు. బాలయ్యకు సంక్రాంతి సెంటిమెంట్ బలంగా ఉంది. అఖండతో హిట్ కొట్టారు. ఈసారి సెప్టెంబర్‌లో తాండవం చేద్దామనుకున్నా కుదర్లే. కనుక ఆయన సంక్రాంతికే అఖండ తాండవం చేసే అవకాశం ఉంది.
నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ కోసం ఎప్పటి నుంచి సంక్రాంతికి ఖర్చీఫ్ వేసుకొని కూర్చున్నాడు. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న మాస్ మహారాజ్ రవితేజ ఈసారి సంక్రాంతికి తన ‘అనార్కలి’ అదృష్టం పరీక్షించుకోవాలనుకుంటున్నారు.
ఇవి కాక కోలీవుడ్ సినిమాలు ఉండనే ఉంటాయి. శివకార్తికేయాన్ నటించిన పరాశక్తి, విజయ్ చేస్తున్న సినిమా రెండూ కూడా సంక్రాంతి టార్గెట్ పెట్టుకున్నాయి.
తాజాగా నారీ నారీ నడుమ నలిగిపోతున్న మురారి శర్వానంద్ కూడా సంక్రాంతికి వద్దామనుకుంటున్నారట!
అన్నీ సరిగ్గా సంక్రాంతి ముందే రాకపోయినా డిసెంబర్ 25 నుంచి జనవరి నెలాఖరులోగా వరుస పెట్టి రిలీజ్ ఆవడం ఖాయమే అని భావించవచ్చు.
ఇన్ని సినిమాలలో ఏది అలరిస్తుందో తెలియదు కానీ సంక్రాంతి పండగకి ఇన్ని సినిమాలు అందుబాటులో ఉంటే నిజంగా పండగే కదా?