అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కి అత్యంత సన్నిహితుడైన చార్లీ కిర్క్ (31) హత్యకు గురయ్యారు. అమెరికాలో తరచూ అమాయక ప్రజలపై కాల్పులు జరుగుతుండటంపై ఉటా వ్యాలీ యూనివర్సిటీలో విద్యార్ధులతో ముఖాముఖి చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నప్పుడు గుర్తు తెలియని వ్యక్తి ఆయన మెడపై తుపాకీతో షూట్ చేయడంతో ఆయన చనిపోయారు. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి ఆయనని తరలించగా చికిత్స పొందుతూ మరణించారు.
1993లో ఇల్లీనాయిస్‌లో జన్మించిన చార్లీ కిర్క్ 18 ఏళ్ళ వయసులోనే టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ అనే సంస్థని స్థాపించారు. దాంతో దేశవ్యాప్తంగా యువతని ఆకర్షించగలిగారు.
అయన ప్రధాన లక్ష్యాలు కన్జర్వేటివ్ భావజాలాన్ని పెంపొందించడం, దేశంలో ఫ్రీ మార్కెట్ కేపిటలిజం, ప్రజల స్వేచ్ఛని ప్రభుత్వాలు హరించకుండా అడ్డుకోవడం, వామపక్ష విధానాలను వ్యతిరేకించడం. ఇటువంటి భావజాలం కలిగిన యువత ద్వారా దేశ రాజకీయాలను ప్రభావితం చేశారు. కాలక్రమంలో చార్లీ కిర్క్ డోనాల్డ్ ట్రంప్‌కి మద్దతుదారుగా మారారు. దేశాధ్యక్షుడికి అత్యంత సన్నిహితుడు, మద్దతుదారు అయిన చార్లీ కిర్క్ బహిరంగంగా హత్యకు గురికావడం అమెరికాలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
అయన హత్యపై ట్రంప్ దిగ్బ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. ఇటువంటి హత్యలతో ప్రజాస్వామ్య గొంతులను ఎవరూ అణచివేయలేరని ట్రంప్ అన్నారు.