కల్వకుంట్ల కవిత ఇటీవల ప్రెస్‌మీట్‌లో “హరీష్ రావు నమ్మకద్రోహి, పార్టీకి, తండ్రికి వెన్నుపోటు పొడుస్తారు... ఆయనతో కాస్త జాగ్రత్తగా ఉండండి,” అంటూ హెచ్చరించారు. వాటిపై కేసీఆర్, హరీష్ రావు ఇద్దరూ తీవ్రంగా స్పందిస్తారనుకుంటే, అసలు పట్టించుకోనట్లు వ్యవహరించడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
“ఆమె ఆరోపణలు ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా,” అని హరీష్ రావు అంటే, “ఆమె గురించి పార్టీలో చర్చించుకొని ఓ నిర్ణయం తీసుకున్నాము కనుక ఇక మాట్లాడాల్సింది ఏమీ లేదన్నారు,” కేటీఆర్.
ఒకవేళ వారు తీవ్రంగా స్పందించి ఉండి ఉంటే మళ్ళీ ఆమెకు కూడా మాట్లాడే అవకాశం కలిగేది. కానీ ఆమెకు ఆ అవకాశం లేకుండా చేశారు.
అంతేకాదు. ఆమె ఇంత తీవ్రమైన ఆరోపణలు చేసిన తర్వాత కేటీఆర్, హరీష్ రావుతో కలిసి నేడు జడ్చర్లకు వెళ్ళారు. అక్కడ మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి శ్వేత ప్రధమ వర్ధంతి సందర్భంగా ఆమె విగ్రహావిస్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తద్వారా హరీష్ రావుపై కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలు నిజం కావని కేటీఆర్ చెప్పినట్లే. కనుక ఆమె ఆరోపణలను ఖండించకుండానే కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ తరపున సమాధానం చెప్పినట్లే లెక్క!
(Video Courtesy: Telugu Scribe)