పారిస్‌లో జరుగుతున్న పారలింపిక్స్‌లో భారత్‌కు తొలిరోజే స్వర్ణ పతకం లభించింది. భారత్ షూటర్ అవని లేఖర 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ (ఎస్‌హెచ్-1) ఈవెంట్‌లో 249.7 పాయింట్లు సాధించి భారత్‌కి తొలి స్వర్ణం సాధించింది. రాజస్థాన్‌కి చెందిన అవని వయసు కేవలం 22 ఏళ్ళు. ఉజ్వల భవిష్యత్ గురించి కలలు కంటున్న ఆమెకు 11 ఏళ్ళ వయసులోనే నడుం క్రింది భాగం చచ్చుబడిపోయింది.
మరొకరైతే అక్కడితో జీవితం ముగిసిపోయిందని తీవ్ర నిరాశా నిస్పృహలతో క్రుంగిపోయేవారే. కానీ అటువంటి పరిస్థితులలో కూడా అవని తాను ఏమి చేయగలనని ఆలోచించి వీల్ ఛైర్లో కూర్చొని షూటింగ్ ప్రాక్టీస్ మొదలు పెట్టింది. ఆవిదంగా అవని తన జీవితాన్ని తానే తీర్చిదిద్దుకుంది.
మూడేళ్ళ క్రితం టోక్యోలో జరిగిన పారలింపిక్స్‌లో అవని 249.6 పాయింట్లు సాధించి స్వర్ణం గెలుచుకోగా, ఈసారి తన రికార్డుని తానే అధిగమిస్తూ 249.7 పాయింట్లతో భారత్‌కు మరోసారి స్వర్ణం సాధించి పెట్టింది.
ఆమె తండ్రి ఎంతగానో ప్రోత్సహించి ఈ క్రీడా రంగంలో ప్రవేశపెట్టడంతో ఆమె పారలింపిక్స్ వరకు చేరుకుని దేశానికి రెండుసార్లు స్వర్ణం సాధించి పెట్టింది. ప్రస్తుతం ఆమె రాజస్థాన్ యూనివర్సిటీలో న్యాయశాస్త్ర విద్యార్ధి.
దక్షిణ కొరియా షూటర్ లీ యున్రీ 246.8 పాయింట్ల రజతం దక్కించుకోగా, భారత్‌కు చెందిన మోనా అగర్వాల్ 228.7 పాయింట్లతో కాంస్యం సాధించింది.