నేడే ఉప రాష్ట్రపతి ఎన్నిక జరుగబోతోంది. ఈరోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు ఓట్లు లెక్కించి వెంటనే ఫలితం ప్రకటిస్తారు.
ఎన్డీఏ అభ్యర్ధిగా సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్ధిగా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉప రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్నారు. పార్లమెంటు ఉభయ సభల సభ్యులు కలిసి వీరిని ఎన్నుకుంటారు.
ప్రస్తుతం లోక్ సభలో 542 మంది, రాజ్యసభలో 239 మంది ఎంపీలు కలిపి మొత్తం 781 మంది ఉన్నారు. వీరిలో బీజేడీకి చెందిన ఏడుగురు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఈ ఎన్నికకు దూరంగా ఉండబోతున్నారు. కనుక మొత్తం 770 మంది సభ్యులు ఈ ఎన్నికలో పాల్గొనబోతున్నారు. కనుక 386 ఓట్లు ఎవరికి లభిస్తే వారు ఉప రాష్ట్రపతిగా ఎన్నికవుతారు.
ఇండియా కూటమికి ఉభయ సభలలో కలిపి మొత్తం 324 మంది ఎంపీలున్నారు. 770 మంది ఎంపీలలో ఎన్డీఏకి లోక్ సభలో 293, రాజ్యసభలో 129 మంది కలిపి మొత్తం 422 మంది ఎంపీలున్నారు. ఇతర పార్టీలకు చెందిన మరికొందరు కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. కనుక ఎన్డీఏ అభ్యర్ధి సీపీ రాధాకృష్ణన్ ఉప రాష్ట్రపతిగా ఎన్నికవడం లాంఛనప్రాయమే.