నేడు సంపూర్ణ చంద్రగ్రహణం.. ఆలయాలన్నీ మూసివేత

September 07, 2025
img

నేడు (ఆదివారం రాత్రి) సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించనుంది. రాత్రి 9.56 గంటలకు మొదలయ్యి అర్దరాత్రి తర్వాత 1.26 గంటలకు చంద్రగ్రహణం ముగుస్తుంది. కనుక గ్రహణ సమయానికి 4-5 గంటల ముందుగానే దేశంలో ఆలయాలన్నీ మూసివేసి మళ్ళీ  గ్రహణం ముగిసిన తర్వాత సంప్రోక్షణ చేసిన తర్వాత సోమవారం తెల్లవారుజామున తెరిచి భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు. భారత్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆఫ్రికా, యూరప్ దేశాలలో ఈ సంపూర్ణ చంద్రగ్రహణం చూడవచ్చు.

తిరుమల శ్రీవారి ఆలయం, తెలంగాణలో యాదాద్రి, భద్రాద్రి, వేములవాడ తదితర ఆలయాలన్నీ ఈరోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాత మూసివేస్తారు.   

అయితే సూర్య, చంద్ర గ్రహణ సమయాలలో తెరిచి ఉండే ఆలయం ఓకే ఒకటి ఉంది. అదే.. ఏపీలో శ్రీకాళహస్తి ఆలయం. దీనిలో నవ గ్రహాలు, సూర్యచంద్రులు, పంచభూతాలు, 27 నక్షత్రాలతో కూడిన కవచం ధరించి పరమశివుడు  వాయులింగం రూపంలో ఉండటం వలన గ్రహణదోషం ఉండదు. 

కనుక గ్రహణం రోజునే ఇక్కడ రాహు-కేతుల పూజలు ఆనవాయితీగా జరుగుతుండటం వలన దేశంలో శ్రీకాళహస్తి ఆలయం ఒక్కటే సూర్య, చంద్ర గ్రహణ సమయాలలో తెరిచి ఉంటుంది. నేడు ప్రత్యేక పూజలు కూడా జరుగుతాయి. జాతక దోషాలున్నవారు నేడు శ్రీకాళహస్తి ఆలయంలో రాహు-కేతు దోష నివారణ పూజలు చేయించుకుంటారు.       

ఈసంపూర్ణ చంద్రగ్రహణానికి మరో కోణం కూడా ఉంది. అదే ‘బ్లడ్ మూన్.’ ఈరోజు గ్రహణ సమయంలో చంద్రుడు ఎర్రటి రంగులోకి మారుతాడు. ఇలా బ్లడ్ మూన్ ఏర్పడిన ప్రతీసారి ప్రపంచవ్యాప్తంగా అనేక యుద్ధాలు, ప్రకృతి విపత్తులు, రోగాలు వాటి కారణంగా భారీగా మరణాలు సంభవించాయి. అలాగే కొందరు ప్రముఖులు మరణించారు. కనుక ఈసారి బ్లడ్ మూన్ ప్రపంచానికి ఏమి విపత్తు తెస్తుందోనని అనేక మంది ఆందోళన చెందుతున్నారు. 

అయితే నేడు గ్రహణం రోజున ఉపవాసాలు, ధ్యానం, పూజలు చేయాలనడాన్ని కొందరు పరిహసిస్తున్నప్పటికీ, వాటి వలన శారీరిక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందనే విషయం మరిచిపోకూడదు.                    


Related Post