ఎన్నాళ్ళకెన్నాళ్ళకు..మళ్ళీ బంగారు పతకం

December 01, 2017
img

సుమారు 23 ఏళ్ళ తరువాత భారత్ మళ్ళీ ‘మిస్ వరల్డ్’ కిరీటం ధరించింది. సుమారు 22 ఏళ్ళ తరవాత భారత్ మళ్ళీ వెయిట్ లిఫ్టింగ్ లో బంగారు పతకం గెలుచుకొంది. మానుషి చిల్లర్ ‘మిస్ వరల్డ్’ తో బోణీ చేస్తే, సాయికోమ్ మీరా భాయ్ ఛాను ‘బంగారు పతకం’ సాధించి ఆ విజయపరంపరను కొనసాగించింది. 

అమెరికాలో కాలిఫోర్నియాలో జరుగుతున్న ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో పాల్గొన్న భారత వెయిట్ లిఫ్టర్ మీరా భాయ్ ఛాను మహిళల 48 కిలోల విభాగంలో మొత్తం 194 కేజీలు బరువు ఎత్తి బంగారు పతకం గెలుచుకొంది.  మొదట ‘స్నాచ్’ లో 85 కిలోల బరువు ఎత్తిన మీరా భాయ్ ఛాను, తరువాత ‘క్లీన్ అండ్ జర్క్’ రౌండ్ లో 109 కిలోలు ఎత్తి బంగారు పతకం సాధించడమే కాకుండా సరికొత్త రికార్డు నెలకొల్పింది.అంతేగాక వచ్చే ఏడాది జరుగనున్న కామన్ వెల్త్ గేమ్స్ పోటీలలో పాల్గొనడానికి అర్హత సాధించింది. 

సుమారు 22 ఏళ్ళ క్రితం కరణం మల్లీశ్వరి వెయిట్ లిఫ్టింగ్ లో బంగారు పతకం సాధించింది. వెయిట్ లిఫ్టింగ్ లో భారత్ మళ్ళీ బంగారు పతకం సాధించడం ఇదే.

2014 లో ‘గ్లాస్ గో’లో జరిగిన కామన్ వెల్త్ గేమ్స్ లో మహిళల 48 కేజీల విభాగంలో మీరా భాయ్ ఛాను వెండి పతకం సాధించగా, భారత్ కే చెందిన మహిళా వెయిట్ లిఫ్టర్ కుముక్చమ్ సంజీత బంగారు పతకం సాధించింది.        

ఆ తరువాత 2016లో జరిగిన రియో ఒలింపిక్ పోటీలలో మీరా భాయ్ ఛాను పాల్గొంది కానీ అప్పుడు విఫలం అయ్యింది. అప్పటి నుంచి మరింత పట్టుదలతో గట్టిగా కృషి చేసి ఈసారి బంగారు పతకం సాధించి భారత్ కు గర్వకారణంగా నిలిచింది. 

మీరా భాయ్ ఛాను (23) మణిపూర్ రాష్ట్రానికి చెందిన యువతి. ఆమె 1994 ఆగస్ట్ 8వ తేదీన మణిపూర్ రాజధాని ఇంఫాల్ లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తల్లితండ్రుల ప్రోత్సాహంతో ఆమె ఈ రంగంలో ప్రవేశించి చివరకు బంగారు పతకం సాధించింది. 


Related Post