సిరాజ్..మన గల్లీలో పోరడే!

October 23, 2017
img

హైదరాబాద్ లో గల వేలాది ఆటో డ్రైవర్లలో అతను కూడా ఒకడు. అతని సంపాదన మీదే ఇల్లు గడవాలి. అటువంటి పేద ఆటో డ్రైవర్ కొడుకు జీవితం ఏవిధంగా ఉంటుందో తేలికగానే ఊహించుకోవచ్చు. ఆర్ధిక ఇబ్బందులు..కష్టాలు అన్నీ షరా మామూలే. ఆ కుర్రాడికి కూడా చాలా మగపిల్లలలాగే క్రికెట్ అంటే పిచ్చి. ఆ పిచ్చే అతని జీవితాన్ని...అతనితోబాటు అతని తల్లి తండ్రుల జీవితాలను మలుపు తిప్పేసింది. ఇది భాగ్యనగరంలో మాసాబ్ టాంక్ వద్ద నివసించే ఒక నిరుపేద ఆటో డ్రైవర్ కొడుకు మహమ్మద్ సిరాజ్ స్టోరీ.


 






చిన్నప్పటి నుంచే క్రికెట్ పై ఆసక్తి పెంచుకొన్న మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ లో మంచి నైపుణ్యం సాధించాడు. సిరాజ్ లో ఉన్న ఆ అద్వితీయమైన ప్రతిభను గుర్తించిన టీం ఇండియా మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, అతనిని చేరదీసి బౌలింగ్ లో శిక్షణ ఇవ్వడంతో సిరాజ్ ఇంకా రాణించాడు. అండర్-23 టోర్నీలలో ఆడుతూ తన అద్భుతమైన బౌలింగుతో సిరాజ్ అందరిదృష్టిని ఆకర్షించగలిగాడు. సిరాజ్ కు కాస్త అదృష్టం కూడా కలిసి రావడంతో మొదటిసారిగా ఐపిఎల్ కు ఎంపికయ్యాడు. ఏనాడూ రూ.500-1,000కి మించి డబ్బు చూడని సిరాజ్, ఐపిఎల్ ఏకంగా రూ.2.6 కోట్లు సంపాదించుకొన్నాడు. దాంతో ఆటో సంపాదనతో జీవిస్తున్న సిరాజ్ కుటుంబం ఒక్కసారిగా కోటీశ్వరులు అయిపోయారు. 

 

ఇక అప్పటి నుంచి సిరాజ్ వ్యక్తిగత జీవితంలో, క్రికెట్ జీవితంలో వెనుతిరిగి చూసుకోనవసరంపడలేదు. త్వరలో న్యూజిలాండ్ తో జరుగబోయే టి-20 మ్యాచ్ లో బిసిసిఐ ఎంపిక చేయడంతో సిరాజ్ కు అంతర్జాతీయ క్రీడాకారుడిగా ప్రమోషన్ వచ్చినట్లయింది.

ఇంతకాలం తమందిరినీ పోషించడానికి అష్టకష్టాలుపడ్డ తల్లి తండ్రులను ఇక జీవితాంతం సుఖంగా జీవించేలా చూసుకొంటానని సిరాజ్ చెప్పాడు. తమ కుటుంబం కోసం హైదరాబాద్ లో ఒక మంచి ఇల్లును కొనుకొంటామని మహమ్మద్ సిరాజ్ చెప్పాడు. మన హైదరాబాద్ పోరడు సిరాజ్ భవిష్యత్ లో వరల్డ్ కప్ లో కూడా ఆడి తనకు, తన కుటుంబానికి,  హైదరాబాద్ నగరానికి భారత్ కు గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించిపెడతాడని ఆశిద్దాం.


న్యూజిలాండ్ తో ఆడబోయే టి20 టీం సభ్యులు: విరాట్ కోహ్లీ, ధోని, హార్దిక్ పాండ్యా, అక్షర పటేల్, రోహిత్, మనీష్ పాండే, రాహుల్, మహమ్మద్ సిరాజ్, దినేష్ కార్తీక్, ధావన్, చాహల్, కుల్ దీప యాదవ్, శ్రేయస్ అయ్యర్,భువనేశ్వర్, జస్ ప్రీత్ బుమ్రా.

Related Post