సారీ ఆస్ట్రేలియా!

October 12, 2017
img





 గువాహటిలో జరిగిన భారత్-ఆస్ట్రేలియా టి-20 మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోవడంతో తీవ్ర నిరాశ చెందిన క్రికెట్ అభిమానులు కొందరు, మ్యాచ్ అనంతరం ఆస్ట్రేలియన్ క్రికెటర్లు తమ బస్సులో హోటల్ కు తిరిగి వెళుతుండగా బస్సుపై రాళ్లతో దాడి చేశారు. ఆ దాడిలో ఎవరూ గాయపడలేదు కానీ అభిమానులలో క్రీడాస్పూర్తి లోపించినందుకు వారు బాధపడ్డారు. వారే కాదు..దేశంలో వివిధ ప్రాంతాలలో క్రికెట్ అభిమానులు కూడా మన దేశానికి వచ్చిన ఆస్ట్రేలియన్ అతిధులపై దాడి చేయడాన్ని నిరసించారు. జరిగిన దానికి బాధ వ్యక్తం చేస్తూ ‘సారీ ఆస్ట్రేలియా’ అని వ్రాసిన ప్లకార్డులు పట్టుకొని మీడియా ముందుకు వచ్చారు. గువాహటిలో అభిమానులు సైతం జరిగిన దానికి పశ్చాతాపం వ్యక్తం చేస్తూ ‘సారీ ఆస్ట్రేలియా’ అని వ్రాసిన ప్లకార్డులు ప్రదర్శించారు. 

దీనిపై ఆసీస్ బౌలర్ అడమ్ జంపా స్పందిస్తూ, “ఆ సమయంలో మేమందరం హెడ్ ఫోన్స్ తగిలించుకొని పాటలు వింటున్నాము. పెద్ద శబ్దం వచ్చేసరికి అందరం ఉలిక్కిపడి ఏమి జరిగిందని చూస్తే బస్సు అద్దం పగిలిపోయుంది. ఎవరో వ్యక్తి మా బస్సుపై రాయి విసిరాడని సెక్యూరిటీ చెప్పాడు. ఈ ఘటనలో ఎవరికీ దెబ్బలు తగులలేదు. అయితే ఎవరో ఒక వ్యక్తి చేసిన ఈ పనికి అందరినీ తప్పు పట్టడం సరికాదని మేము భావిస్తున్నాము. భారత్ క్రికెట్ అభిమానులు అందరూ మమ్మల్ని కూడా ఎంతగానో అభిమానిస్తారనే సంగతి మాకు తెలుసు. కనుక మేము ఇండియాలో క్రికెట్ ఆడేందుకు ఇష్టపడతాము. ఇదివరకు బంగ్లాదేశ్ లో కూడా ఓసారి ఇటువంటి ఘటన జరిగింది కానీ దానిని మేము సీరియస్ గా భావించలేదు. క్రికెట్ అభిమానులు అప్పుడప్పుడు ఈవిధంగా ప్రవర్తించడం మాకు అలవాటే. భారత్ తో క్రికెట్ ఆడేందుకు మేము సిద్ధమే,” అని చెప్పారు.  


Related Post