సిద్ధిపేటలో 20-20 క్రికెట్ మ్యాచ్ ఆడిన మంత్రి హరీష్‌రావు

December 03, 2020
img

అవును...రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి హరీష్‌రావే... క్రికెట్ ఆడారు...అద్భుతంగా బ్యాటింగ్ చేశారు కూడా. బుదవారం రాత్రి సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో సిద్ధిపేట-హైదరాబాద్‌ జట్ల మద్య 20-20 క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సిద్ధిపేట జట్టుకు మంత్రి హరీష్‌రావు కెప్టెన్‌గా వ్యవహరించగా, హైదరాబాద్‌ మెడికవర్ డాక్టర్స్ జట్టుకు డాక్టర్ కృష్ణకిరణ్ కెప్టెన్‌గా వ్యవహరించారు.      

టాస్ గెలిచిన హైదరాబాద్‌ జట్టు బౌలింగ్ ఎంచుకోవడంతో మంత్రి హరీష్‌రావు జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన మంత్రి హరీష్‌రావు 12 బంతులలో 3 ఫోర్లు కొట్టి 18 పరుగులు తీసి అవుటయ్యారు. ఆయన బ్యాటింగ్‌కు దిగగానే స్టేడియం అంతా ఈలలు, కేకలు, చప్పట్లతో మారుమ్రోగిపోయింది. ఈ వయసులో కూడా ఆయన అంతా ఉత్సాహంగా అద్భుతంగా ఆడగలరని ఊహించని ప్రేక్షకులు ఆయన వికెట్ల మద్య చురుకుగా పరుగులు తీస్తుండటం, అద్భుతంగా ఫోర్లు కొట్టడం చూసి సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయారు. కేరింతలు కొడుతూ ఆయన ఆటను ఆస్వాదించారు. 

సిద్ధిపేట జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 165 పరుగులు సాధించగా తరువాత బ్యాటింగ్‌కు వచ్చిన హైదరాబాద్‌ జట్టు 20 ఓవర్లలో 149 పరుగులు చేసి ఆల్ అవుట్ అయిపోవడంతో సిద్ధిపేట జట్టు 16 పరుగులతో విజయం సాధించింది.

Related Post