ఆ నిర్ణయం వెనక్కు తీసుకొన్నాను: అంబటి రాయుడు

August 30, 2019
img

క్రికెటర్ అంబటిరాయుడు మళ్ళీ అన్ని ఫార్మాట్లలో ఆడాలని నిర్ణయించుకున్నాడు. ప్రపంచకప్ పోటీలకు తనను అదనపు ప్లేయర్‌గా సెలెక్ట్ చేసినప్పటికీ, తనను పక్కనపెట్టి వేరేవారికి అవకాశం కల్పించడంతో తీవ్ర నిరాశానిస్పృహలకు లోనైన అంబటి రాయుడు క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. కానీ దాని వలన తానే నష్టపోతానని గ్రహించిన అంబటి రాయుడు, తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకొని మళ్ళీ అన్ని ఫార్మాట్లలో ఆడాలని నిర్ణయించుకున్నట్లు తెలియజేస్తూ హైదరాబాద్‌ క్రికెట్ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ)కు ఒక లేఖ ద్వారా తెలియజేశాడు. వచ్చే నెల 10వ తేదీ నుంచి తాను హెచ్‌సీఏకు అందుబాటులో ఉంటానని తెలియజేశాడు. హెచ్‌సీఏ కూడా అంబటి నిర్ణయాన్ని స్వాగతించింది.

ఆనాడు తీవ్ర భావోద్వేగానికి గురై ఆ ఆవేశంలో తొందరపడి రిటైర్ అవ్వాలనుకున్నానని కానీ వివిఎస్ లక్ష్మణ్, నోయల్ డేవిడ్ ఇద్దరూ తనకు మంచి భవిష్యత్ ఉందని నచ్చచెప్పడంతో మళ్ళీ క్రికెట్ ఆడాలని  నిర్ణయించుకున్నానని అంబటి రాయుడు తెలిపారు. భారత్ క్రికెట్ రంగంలో ప్రతిభకు తప్పకుండా గుర్తింపు లభిస్తుంది.

అయితే ఈ రంగంలో క్రికెట్ ఆట కంటే రాజకీయాలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ తెర వెనుక రాజకీయాలు, కుట్రల కారణంగా చాలా మంది ఆటగాళ్ళు జట్టులో తమ స్థానం నిలుపుకోవడానికి యుద్ధాలు చేయక తప్పనిసరి పరిస్థితి ఎదురవుతుంటుంది. కనుక ఒకపక్క జట్టులో తమ స్థానం కాపాడుకోవడానికి అంతర్గతంగా యుద్ధాలు చేస్తూనే, మరోపక్క క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేయవలసి ఉంటుంది. కనుక క్రికెట్ ఆటగాళ్ళు నిరంతరం తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. అంబటి రాయుడు కూడా ఆవిధంగానే బయటకు వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తున్నాడని భావించవచ్చు. 

Related Post