కొందరు నన్ను వద్దనుకొంటున్నారు: ధోని ఆవేదన

July 06, 2019
img

భారత్‌ క్రికెట్ రంగంలో క్రికెట్ ఆట కంటే రాజకీయాలే ఎక్కువగా సాగుతుంటాయి. ఎవరి వెనుక ఎవరు గోతులు తవ్వుతుంటారో...ఎవరు ఎప్పుడు అవమానకరంగా తప్పుకోవలసి ఉంటుందో ఎవరికీ తెలియదు. గల్లీ స్థాయి క్లబ్ మొదలు బిసిసిఐ వరకు ఎక్కడ చూసినా రాజకీయాలు, ఈర్ష్యాద్వేషాలు, పంతలు పట్టింపులే కన్పిస్తుంటాయి. ఇక అభిమానులు కూడా క్రికెటర్ల నుంచి ఎప్పుడూ గెలుపే ఆశిస్తూ వారు సరిగ్గా ఆడలేకపోయినప్పుడు విపరీత ధోరణిని ప్రదర్శిస్తుంటారు. 

ఈ ఒత్తిళ్ళను అన్నిటినీ తట్టుకొంటూ ఆటగాళ్లు జట్టులో మిగిలినవారితోను, ప్రత్యర్ధి జట్టుతోను పోటీ పడుతూ   రాణించవలసి ఉంటుంది. కానీ ఎంత గొప్ప ఆటగాడికైనా ఎల్లపుడూ రాణించడం కష్టమనే సంగతి అందరికీ తెలుసు. కానీ దానిని అంగీకరించడానికి చాలా మంది ఇష్టపడరు. అందుకే భారత్‌ మేటి క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రపంచకప్ పోటీలలో కాస్త రాణించలేకపోయేసరికి ఆయన ఇక రిటైర్ అయితే మంచిదని, ప్రపంచకప్ తరువాత రిటైర్ అవుతారంటూ ధోనీపై రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. 

అవి ధోనీ చెవిన పడటంతో ఆయన చాలా ఆవేదన చెందినట్లున్నారు. మీడియాతో మాట్లాడుతూ, “నేను ఎప్పుడు తప్పుకుంటానో ఇప్పుడే చెప్పలేను కానీ ప్రపంచ ప్రపంచకప్‌లో శ్రీలంకతో మ్యాచ్ ఆడక ముందే తప్పుకోవాలని కొంతమంది కోరుకొంటున్నారు,” అని అన్నారు. 

గతంలో ప్రపంచకప్‌ పోటీలలో ఆడుతున్నప్పుడు సచిన్ టెండూల్కర్ కూడా సరిగ్గా ఇటువంటి అవమానకర పరిస్థితులే ఎదుర్కున్నారు. ఈసారి అంబటి రాయుడు, ధోనీ ఎదుర్కొన్నారు. బహుశః ప్రపంచంలో మరే క్రీడాకారుడు మన క్రికెటర్స్ ఎదుర్కొన్నంత ఒత్తిళ్ళు, రాజకీయాలు ఎదుర్కొని ఉండరేమో?

Related Post