సచిన్ గురువు అచ్రేకర్‌ మృతి

January 02, 2019
img

టీం ఇండియా మాజీ కెప్టెన్ సచిన్ టెండూల్కర్ చేత బాల్యంలోనే క్రికెట్ బ్యాట్ పట్టించి ప్రపంచంలో మేటి క్రీడాకారులలో ఒకరిగా తీర్చిదిద్దిన సచిన్ గురువు రమాకాంత్‌ అచ్రేకర్‌(87) బుదవారం సాయంత్రం ముంబైలో కనుమూశారు. ఆయన గత కొంతకాలంగా వృద్ధాప్య సంబందిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స తీసుకొంటున్నారు. 

వినోద్ కాంబ్లీ, చంద్రకాంత్ పండిత్, సంజెయ్ బంగర్, రవీన్ ఆమ్రే, రమేశ్ పవార్ వంటి అనేకమంది మేటి క్రీడాకారులందరూ ఆయన శిష్యులే. అటువంటి గొప్ప శిష్యులెందరినో తీర్చిదిద్దిన ఆయనను భారతప్రభుత్వం పద్మశ్రీ , ద్రోణాచార్య అవార్డులతో సత్కరించింది. 

ఆయన శిష్యుడైన సచిన్ టెండూల్కర్ భారతరత్న అవార్డు అందుకొని గురువును మించిన శిష్యుడనిపించుకొన్నప్పటికీ అవకాశం చిక్కినప్పుడల్లా గురువు రమాకాంత్‌ అచ్రేకర్‌ ఇంటికి వెళ్ళి ఆయనను పరామర్శించి, ఆశీర్వాదం తీసుకొని వస్తుంటారు. తనకు ఇంత కీర్తి ప్రతిష్టలు కలగడానికి కారకుడైన గురువుగారు మృతి చెందడం సచిన్ టెండూల్కర్ కు చాలా బాధ కలిగించక మానదు. భారత క్రికెట్ బోర్డు కూడా ఆయన మృతికి సంతాపం ప్రకటించింది.

Related Post