సిల్వర్ మెడల్ సాధించినా పట్టించుకొనే నాధుడే లేడు!

February 22, 2018
img

అతని పేరు కె.సుధీర్ కుమార్. వయసు 23సం.లు. ఏపిలోని కర్నూలు జిల్లాలో పాణ్యం మండలంలో మారుమూల గ్రామం బలపనూరు అతని స్వగ్రామం.  అతని తండ్రి రాంబాగన్ దాస్ ఏపిఎస్ ఆర్టీసిలో మెకానిక్ గా పనిచేస్తున్నారు. ఈ నేపద్యం నుంచి వచ్చిన సుధీర్ కుమార్ లుధియానాలో ఫిబ్రవరి 10న జరిగిన ఐఎఫ్.బి.బి. ప్రో క్వాలిఫయర్ సిరీస్ షేరు క్లాసిక్-2018 జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో 70 కేజీల విభాగంలో సిల్వర్ మెడల్ సాధించాడు. బాడీ బిల్డింగ్ జాతీయస్థాయి పోటీలలో ఇవి అత్యున్నతస్థాయి పోటీలుగా పరిగణింపబడుతాయి. వీటిలో అతను సిల్వర్ మెడల్ సాధించడం మామూలు విషయమేమీ కాదు. అతను ప్రతిష్టాత్మకమైన ఈ పోటీలలో సిల్వర్ మెడల్ సాధించినప్పుడు అతని వెంట ఉన్నది అతని భార్య మాత్రమే. వారు ఏపికి తిరిగివచ్చిన తరువాతైనా ఏపి క్రీడామంత్రిత్వశాఖ మంత్రి, ఆ శాఖా అధికారులు, అధికార పార్టీ నేతలు గానీ పట్టించుకోలేదు. ఇదీ...ఏపి సర్కార్ క్రీడలకు ఇస్తున్న ప్రోత్సాహం. 

పివి సింధు ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ సాధించినప్పుడు, తెలంగాణా సర్కార్ ఆమెకు బారీ నగదు బహుమతి, ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఇస్తే, ఏపి సర్కార్ కూడా పోటీపడి ఆమెకు రూ.3 కోట్లు నగదు బహుమతి, డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం, అమరావతిలో ఇల్లు కట్టుకోవడానికి 1,000 గజాల స్థలం ఇచ్చింది. కానీ నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన  సుధీర్ కుమార్ స్వయంకృషితో కష్టపడి రాష్ట్రానికి సిల్వర్ మెడల్ సాధించినప్పటికీ అతనిని పట్టించుకోలేదు. నిజానికి పివి సింధు, సానియా మీర్జావంటి ధనవంతులైన క్రీడాకారుల కంటే ఇటువంటి నిరుపేద క్రీడాకారులకే ప్రభుత్వ సహాయ సహకారాలు, ప్రోత్సాహం చాలా అవసరం. వారికి లక్షలు, కోట్లు ముట్టజెప్పకపోయినా ఏమీ కాదు కానీ ఇటువంటి నిరుపేద క్రీదాకాడురుడికి లక్ష రూపాయలు ఇచ్చినా అది ఎంతో ఉపయోగపడుతుంది. తెలంగాణా రాష్ట్రంలో ఇటువంటి మట్టిలో మాణిక్యాలు చాలా ఉన్నాయి. వారిని ప్రభుత్వాలు గుర్తించి ప్రోత్సహిస్తే రాష్ట్రానికి, దేశానికి పతకాలు సాధిస్తారు.       

సుధీర్ కుమార్ 2017లో ఏపిలో జరిగిన బాడీ బిల్డింగ్ పోటీలలో ‘మిస్టర్ ఏపి’ అవార్డును గెలుచుకొన్నాడు. రాష్ట్ర స్థాయిలో జరిగిన పోటీలలో పాల్గొని 5బంగారు పతకాలతో సహా మొత్తం 15 పతకాలు గెలుచుకొన్నాడు. ఇప్పుడు జాతీయ స్థాయిలో సిల్వర్ మెడల్ గెలుచుకొన్నాడు. ప్రభుత్వం తోడ్పాటు అందించి తనకు సహకరిస్తే, మిస్టర్ ఒలింపియా మెడల్ సాధించాలనుకొంటున్నానని చెప్పాడు. సుధీర్ కుమార్ ప్రస్తుతం నంద్యాలలోని ఆర్.జి.ఎం. కాలేజి ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో జిమ్ కోచ్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకొంటున్నాడు.


Related Post