కాంగ్రెస్‌, బీజేపీలు చెరో 8 సీట్లు: హరీష్ రావు

May 04, 2024


img

మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు శనివారం హైదరాబాద్‌లో ‘మీట్ ద ప్రెస్‌’ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు చెప్పారు. 

ధనిక రాష్ట్రమైన తెలంగాణ దివాళా తీసిందని, అప్పుల పాలైపోయిందని సిఎం రేవంత్‌ రెడ్డి మంత్రులు చెపుతున్న మాటలతో హైదరాబాద్‌, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ దెబ్బ తింటోందని హరీష్ రావు అన్నారు. ఇటువంటి మాటల వలన హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావం పడుతోందని అన్నారు. 

ఓ ప్రశ్నకు సమాధానం చెపుతూ “కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించకపోతే రేవంత్‌ రెడ్డి ఎక్కడ ఉండేవారు? ఏమి చేస్తుండేవారు? కేసీఆర్‌ కృషి, పట్టుదల వల్లే తెలంగాణ ఏర్పడింది. రేవంత్‌ రెడ్డికి ఈ ముఖ్యమంత్రి పదవి లభించింది. కానీ కేసీఆర్‌ వయసులో, అనుభవంలో తన కంటే పెద్దవారనే ఇంగింత జ్ఞానం కూడా లేకుండా రేవంత్‌ రెడ్డి ఆయన గురించి నోటికి వచ్చిన్నట్లు మాట్లాడుతున్నారు. రేవంత్‌ రెడ్డికి తెలంగాణ ప్రజలే బుద్ధి చెప్పబోతున్నారు,” అని హరీష్ రావు అన్నారు. 

కాంగ్రెస్‌, బీజేపీలు కుమ్మక్కు అయ్యాయని చెపుతూ, “రెండు పార్టీలు చెరో 8 సీట్లు గెలుచుకునే విదంగా పరస్పరం ఒప్పందం చేసుకొని అవి పోటీ చేస్తున్న 16 సీట్లలో చెరో 8 మంది డమ్మీ అభ్యర్ధులను నిలబెట్టాయి. అయితే కాంగ్రెస్‌, బీజేపీలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా లోక్‌సభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీయే అత్యధిక స్థానాలు గెలుచుకోబోతోంది,” అని అన్నారు. 

“రేవంత్‌ రెడ్డి ఆరు గ్యారెంటీలను అమలు చేశాక ప్రజలను ఓట్లు అడిగితే బాగుండేది. కానీ ఏ ఒక్కటి అమలు చేయకుండానే మళ్ళీ ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకునేందుకు ఇప్పుడు దేవుళ్ళపై ఓట్లు వేస్తున్నారు,” అంటూ హరీష్ రావు ఎద్దేవా చేశారు. 

కాంగ్రెస్‌, బీజేపీ రెంటికీ ఎన్నికలే ముఖ్యం తప్ప తెలంగాణ రాష్ట్రం, ప్రజల మీద ఎటువంటి ఆసక్తి లేదని హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్‌కు పగలు, ప్రతీకారాలే తప్ప తెలంగాణ రాష్ట్రం, రైతులు, ప్రజలు కష్టాలు పట్టవనే విషయం నాలుగు నెలల కాంగ్రెస్‌ పాలనలో తేలిపోయిందని అన్నారు. బిఆర్ఎస్ పార్టీకి మాత్రమే తెలంగాణ పట్ల పూర్తి నిబద్దత ఉందని, కనుక లోక్‌సభ ఎన్నికలలో ప్రజలు బిఆర్ఎస్ పార్టీనే అత్యధిక సీట్లతో గెలిపించబోతున్నారని హరీష్ రావు అన్నారు.


Related Post