రిజర్వేషన్ల గురించి కేసీఆర్‌, కేటీఆర్‌ మౌనమేల?

May 04, 2024


img

తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి శుక్రవారం జగిత్యాల జిల్లా రాజారాంపల్లి, సిరిసిల్లలో జరిగిన ఎన్నికల సభలో బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌లను ఉద్దేశ్యించి కొన్ని సూటి ప్రశ్నలు వేశారు. 

“మళ్ళీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేయాలనుకుంటోంది. అందుకే ఈసారి లోక్‌సభ ఎన్నికలలో కనీసం 400 సీట్లు గెలుచుకోవాలని ప్రయత్నిస్తోంది. రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తుంటే బడుగు బలహీన వర్గాల కోసం తపించిపోతున్నామని చెప్పుకుంటే కేసీఆర్‌, కేటీఆర్‌ ఎందుకు మాట్లాడటం లేదు?” అని ప్రశ్నించారు. 

బీజేపీ అధికారంలోకి వచ్చాక 2021లో జనభా లెక్కలు తీయడం మానేసింది. జనాభా లెక్కలు తీస్తే పెరిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ జనాభా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాల్సి వస్తుంది. అది బీజేపీకి ఇష్టం లేదు. ఈ విషయం కూడా కేసీఆర్‌, కేటీఆర్‌ ఎన్నడూ మాట్లాడింది లేదు. 

“కేసీఆర్‌ 2022లో ఓ సారి ప్రెస్‌మీట్‌ పెట్టి అంబేడ్కర్ వ్రాసిన రాజ్యాంగం మార్చి వ్రాయిస్తానన్నారు. కేసీఆర్‌ ఏవిదంగా రాజ్యాంగం మార్చాలనుకుంటున్నారో మోడీ కూడా అలాగే రాజ్యాంగం మార్చాలనుకుంటున్నారు. వీరిద్దరూ నియంతలే కనుక వీరిద్దరి ఆలోచనలు కూడా ఇంచుమించు ఒకలాగే ఉంటాయి. అందుకే రాజ్యాంగం గురించి బీజేపీ కుట్ర చేస్తోందని తెలిసినా కేసీఆర్‌ మౌనంగా ఉండిపోతున్నారు,” అని సిఎం రేవంత్‌ రెడ్డి ఆక్షేపించారు.

కేసీఆర్‌, మోడీ ఇద్దరూ చేతులు కలిపి త్న ప్రభుత్వాన్ని కూల్చేయాలని అనుకుంటున్నారు. కానీ తన ప్రభుత్వాన్ని అంగుళం కూడా కదపలేరని సిఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.


Related Post