కేసీఆర్‌ అరెస్ట్: మరో కొత్త డ్రామా?

May 07, 2024


img

బిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ తాజా ఇంటర్వ్యూలో ఝార్ఖండ్ సిఎం హేమంత్ సొరేన్, ఢిల్లీ సిఎం అర్వింద్ కేజ్రీవాల్‌తో పాటు  తనను కూడా అరెస్ట్ చేయించి జైలుకి పంపాలని ప్రధాని నరేంద్రమోడీ అనుకున్నారని, కానీ తాను ఎక్కడా అవినీతికి పాల్పడకపోవడంతో అరెస్ట్ చేయించలేకపోయారని అన్నారు. 

దీనిపై బీజేపీ ఎంపీ, కరీంనగర్‌ ఎంపీ అభ్యర్ధి బండి సంజయ్‌ వెంటనే స్పందిస్తూ, “లోక్‌సభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి ఓటమి తప్పదని గ్రహించిన కేసీఆర్‌, మోడీ తనను అరెస్ట్ చేయించాలని అనుకున్నారంటూ మరో కొత్త డ్రామా మొదలుపెట్టి సానుభూతి ఓట్లు సంపాదించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. 

కేసీఆర్‌ కుటుంబం కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతికి పాల్పడింది. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు దానిపై విచారణ జరుపుతున్నాయి కూడా. కేసీఆర్‌ కుటుంబం తెలంగాణలో ఎంతగా ఆస్తులు పెంచుకుందో అందరికీ తెలుసు. ఇక్కడ అక్రమంగా సంపాదించిన డబ్బుతో విదేశాలలో కూడా వారు పెట్టుబడులు పెడుతున్నారు. కేసీఆర్‌ కుటుంబం అక్రమ సంపాదన, ఆస్తులపై నేను చర్చకు సిద్దం. మీరు సిద్దమేనా?” అని బండి సంజయ్‌ సవాలు విసిరారు. 

కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు నాణేనికి బొమ్మ బొరుసు వంటివని, అవినీతిలో దేనికదే సాటి అని బండి సంజయ్‌ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ మాయమాటలను నమ్మి ప్రజలు గెలిపిస్తే, హామీలు అమలుచేయకుండా ఇంకా మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టేందుకే ప్రయత్నిస్తోందని,” బండి సంజయ్‌ ఆరోపించారు.

తాను అవినీతికి పాల్పడలేదు కనుక మోడీ తనను అరెస్ట్ చేయించలేకపోయారని కేసీఆర్‌ చేసిన ఈ వ్యాఖ్యలను మరోలా చెప్పుకుంటే, హేమంత్ సొరేన్, అర్వింద్ కేజ్రీవాల్‌ ఇద్దరూ అవినీతికి పాల్పడ్డారు కనుకనే మోడీ అరెస్ట్ చేయగలిగారని కేసీఆర్‌ చెప్పిన్నట్లు భావించవచ్చు. ఒకవేళ అర్వింద్ కేజ్రీవాల్‌ అవినీతికి పాల్పడి ఉంటే అదే కేసులో అరెస్ట్ అయిన కల్వకుంట్ల కవిత కూడా నేరం చేసిన్నట్లే అనుకోవాలా?


Related Post