పది రోజులలో కవితపై చార్జ్ షీట్‌: సీబీఐ

May 07, 2024


img

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యూడిషియల్ రిమాండ్‌ నేటితో ముగియడంతో సీబీఐ అధికారులు ఆమెను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా సీబీఐ తరపు న్యాయవాది ఆమె కస్టడీని మరో 10 రోజులు పొడిగించాలని, ఆలోగా ఆమెపై ఈ కేసుకి సంబందించి చార్జ్ షీట్ దాఖలు చేస్తామని చెప్పారు. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత ఆమె జ్యూడిషియల్ రిమాండ్‌ మే 14వరకు అంటే మరో వారం రోజులు పొడిగిస్తున్నట్లు న్యాయమూర్తి కావేరీ బవేజా తీర్పు చెప్పారు. 

ఈ కేసులో కల్వకుంట్ల కవితని మార్చి 15న సీబీఐ అధికారులు హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకు వెళ్ళారు. అప్పటి నుంచి మే 14వరకు అంటే దాదాపు రెండు నెలలు ఆమె జైల్లోనే గడిపిన్నట్లవుతుంది.

ఆమెకు బెయిల్‌ లభిస్తుందనుకుంటే, ఆమెపై చార్జ్ షీట్ దాఖలు చేస్తామని కోర్టుకి సీబీఐ తెలియజేయడంతో, మే 14 తర్వాత కూడా ఆమెకు జైలు నుంచి విముక్తి లభించే అవకాశం కనిపించడం లేదు.

అయితే లోక్‌సభ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాలలో అనూహ్యమైన పరిణామాలు జరుగుతాయనే సంకేతాలు వెలువడుతున్నాయి. కనుక వాటి వలన కల్వకుంట్ల కవితకు బెయిల్‌ లభించే అవకాశం ఉండవచ్చు లేదా ఈ కేసు ఇంకా బిగుసుకుపోవచ్చు.


Related Post