ఆరుగురు బిఆర్ఎస్‌ అభ్యర్ధులు నన్ను కలిశారు: రేవంత్‌ రెడ్డి

May 07, 2024


img

లోక్‌సభ ఎన్నికలు కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం కోసమే జరుగుతున్నప్పటికీ, తెలంగాణలో జరుగబోతున్న ఎన్నికలు రాష్ట్ర రాజకీయాలను, పార్టీలను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. కనుక మూడు ప్రధాన పార్టీలు కూడా ఈ ఎన్నికలలో 17 సీట్లకు కనీసం 12 ఎంపీ సీట్లు సాధించాలనే లక్ష్యంగా పెట్టుకున్నాయి. అన్ని సీట్లు తామే తప్పక సాధిస్తామని చెప్పుకుంటున్నాయి కూడా. 

ఈ ఎన్నికల ప్రచారంలో బిఆర్ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌తో సహా అందరూ రేవంత్‌ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని    విమర్శలు, ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం సిఎం రేవంత్‌ రెడ్డి ప్రముఖ తెలుగు న్యూస్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్‌ ఎడిటర్ వేమూరి రాధాకృష్ణకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిఆర్ఎస్‌, కేసీఆర్‌ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 

“లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసేందుకు కేసీఆర్‌ బీఫారంలు ఇచ్చిన అభ్యర్ధులలో ఆరుగురు వచ్చి నన్ను కలిశారు.  నేను ఊ తమ నామినేషన్స్‌ ఉపసంహరించుకుంటామని కూడా చెప్పారు. కానీ ఇప్పుడు అంత అవసరం లేదని వారించాను. నేను వారిని కావాలనుకొని ఉంటే బిఆర్ఎస్‌ పార్టీకి ఆరుగురు అభ్యర్ధులు ఉండేవారు కారు. కేసీఆర్‌ బీఫారంలు ఇచ్చినా ఆ పార్టీ తరపున పోటీ చేసేందుకు అభ్యర్ధులు వెనకాడుతున్నారంటే బిఆర్ఎస్‌ పార్టీ ఏ పరిస్థితిలో ఉందో అర్దం చేసుకోవచ్చు,” అని రేవంత్‌ రెడ్డి అన్నారు. 

“ఇవి లోక్‌సభ ఎన్నికలు. ఈ ఎన్నికలతో ప్రాంతీయ పార్టీ అయిన బిఆర్ఎస్‌కు ఎటువంటి సంబంధమూ లేదు. అయినా 12 సీట్లు గెలిపిస్తే ఏదో చేస్తామంటూ కేసీఆర్‌ ప్రజలకు మాయమాటలు చెపుతున్నారు. ఇదివరకు 9 మంది ఎంపీలను ఇచ్చినప్పుడు ఏం చేశారు? ఇప్పుడు గెలిపించినా ఏమీ చేయలేరు,” అని రేవంత్‌ రెడ్డి అన్నారు. 

బిఆర్ఎస్‌ పార్టీ గురించి మాట్లాడుతూ, “కేసీఆర్‌ అవినీతి, అహంకారం, నియంతృత్వ పోకడలను తెలంగాణ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. అందువల్లే శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్‌ ఓడిపోయింది. నేటికీ కేసీఆర్‌ మీద ప్రజల కోపం చల్లారలేదు. లోక్‌సభ ఎన్నికలలో మరోసారి బిఆర్ఎస్‌ పార్టీని ఒడగొట్టి తమ కోపాన్ని చాల్లార్చుకోబోతున్నారు,” అని సిఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.


Related Post