ప్రాజెక్టులను సందర్శించిన ఎన్నారైలు

December 22, 2017
img

అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి దూరదేశాలలో ఎంతోమంది తెలంగాణావాసులు స్థిరపడ్డారు. మాతృదేశానికి, పుట్టిపెరిగిన గడ్డకు అంతదూరంలో ఉంటున్నప్పటికీ వారు మన బాష, సంస్కృతిని మరిచిపోలేదు. నేటి తమ ఈ ఉన్నతికి కారణమైన రాష్ట్రాన్ని మరిచిపోలేదు. తెలంగాణా రాష్ట్రం కోసం, నిస్సహాయులు, నిరుపేదల కోసం, ప్రతిభ గల విద్యార్ధుల కోసం యధాశక్తిన ఏదో ఒక సేవాకార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఉడతాభక్తిగా తమ సహాయసహకారాలు అందిస్తూనే ఉన్నారు.

అమెరికాలోని ఆటా, టాట సభ్యులు సేవా డేస్ పేరిట తెలంగాణా రాష్ట్రంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన సంగతి ఇదివరకే చెప్పుకొన్నాము. వారిలో సుమారు 40 మంది కలిసి నిన్న సిద్ధిపేట, గజ్వేల్, నియోజకవర్గాలాల్ పర్యటించి ఆ ప్రాంతాలలో జరుగుతున్న పలుఅభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ పద్మాకర్ స్వయంగా వారిని మినీ ట్యాంక్ బండ్ గా రూపొందించబడుతున్న కోమటి చెరువును, సమీపంలోని వైకుంఠధామం, నర్సాపూర్ ప్రాంతంలో నిర్మించబడుతున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను చూపించి వాటి వివరాలను తెలియజేశారు. అనంతరం మిషన్ భగీరధ, కాళేశ్వరం పనుల పురోగతి గురించి ఎన్నారైలు అడిగి తెలుసుకొన్నారు. రాష్ట్రంలో మౌలికవసతుల కల్పనకు జరుగుతున్న పనుల గురించి అడిగితెలుసుకొన్నారు.

ఎక్కడో దూరంగా ఉన్న తాము రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి మీడియా ద్వారా విన్తున్నామని ఇప్పుడు కళ్ళారా చూడటం చాలా ఆనందంగా ఉందని అన్నారు.  ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నందుకు వారు సంతోషం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఒకవైపు సాగునీటి ప్రాజెక్టు పనులను, మిషన్ కాకతీయ పనులను పర్యవేక్షిస్తూనే మరోపక్క సిద్ధిపేట జిల్లాను కూడా వేగంగా అభివృద్ధి చేస్తునందుకు మంత్రి హరీష్ రావును ప్రశంసించారు. రాష్ట్రం కోసం తమ శక్తిమేర సహాయసహకారాలు అందించడానికి తాము ఎప్పుడూ సిద్దంగానే ఉన్నామని వారు చెప్పారు. 

Related Post