అమెరికాలో మళ్ళీ తుపాకులు పేలాయి. ఈసారి మిస్సౌరి రాష్ట్రంలోని కెన్సాస్ నగరంలో పేలాయి. అమెరికాలో ఏటా జరిగే సూపర్ బౌల్ ఫుట్ బాల్ లీగ్ మ్యాచ్ జరుగుతుంటుంది. మొన్న ఆదివారం జరిగిన ఈ సూపర్ బౌల్ ఫైనల్స్ మ్యాచ్‌లో గెలిచిన కెన్సాస్ జట్టు శాన్‌ఫ్రాన్సిస్‌కో జట్టుపై విజయం సాధించింది.
ఈ సందర్భంగా కెన్సాస్ నగరంలో కెన్సాస్ జట్టు సూపర్ బౌల్ విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. దీనిలో వేలాదిమంది ప్రజలు పాల్గొని ఆటగాళ్ళని హర్షధ్వానాలతో అభినందిస్తుంతే అక్కడ పండగ వాతావరణం నెలకొంది. మరికొన్ని నిమిషాలలో ర్యాలీ ముగుస్తుందనగా హటాత్తుగా తుపాకులు గర్జించాయి. తుపాకుల శబ్ధాలు విని వేదిక మీద ఆటగాళ్ళతో సహా ర్యాలీకి హాజరైన ప్రజలు భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు.
ఈ కాల్పులలో ఒకరు మరణించగా, 22 మందికి పైగా గాయపడ్డారు. వారిలో 11 మంది పిల్లలు కూడా ఉన్నారు. గాయపడినవారిలో ముగ్గురు పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అక్కడే ఉన్న కెన్సాస్ సిటీ పోలీస్ కాల్పులు జరిపిన ముగ్గురు దుండగులను పట్టుకున్నారు. ఈ కాల్పుల ఘటనపై సిటీ పోలీస్ చీఫ్ స్టేసీ గ్రేవ్స్ విచారం వ్యక్తం చేశారు.