అమెరికాలో హైదరాబాద్‌ విద్యార్ధి కిడ్నాప్

March 21, 2024
img


హైదరాబాద్‌ నాచారంలోని అంబేడ్కర్ నగర్‌కు చెందిన అబ్దుల్ మహ్మద్ అరాఫత్ (25) అమెరికాలో కొందరు దుండగులు కిడ్నాప్ చేసి ఎత్తుకుపోయారు. అతను ఓహియో రాష్ట్రంలోని క్లీవ్‌ల్యాండ్ యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తున్నాడు. గత ఏడాది మేలో అక్కడకు వెళ్ళాడు. ఈ నెల 7వ తేదీన చివరిసారిగా తండ్రి మహ్మద్ సలీంతో ఫోన్లో మాట్లాడాడు. మర్నాడు కొడుకు నుంచి ఫోన్ రాకపోవడంతో సలీం ఫోన్ చేయగా స్విచ్చాఫ్ అని వచ్చింది. ఆ మరుసటి రోజు కూడా ఫోన్ ‘స్విచ్చాఫ్’లో ఉండటంతో సలీం వెంటనే క్లీవ్‌ల్యాండ్ ఉంటున్న తన బంధువులకు ఫోన్ చేసి విషయం చెప్పగా వారు యూనివర్సిటీలోకి వెళ్ళి వాకబు చేయగా అబ్దుల్ మహ్మద్ అరాఫత్ నాలుగు రోజులుగా హాస్టల్‌లో లేడని తోటి విద్యార్దులు తెలిపారు. వెంటనే వారు క్లీవ్ లాండ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ ఇంతవరకు అతను ఎక్కడ ఉన్నాడో కనిపెట్టలేకపోయారు. 

దీంతో అతని తండ్రి భారత విదేశాంగ శాఖ కార్యాలయానికి ఈ విషయం తెలియజేసి సాయం కోరారు. అయితే రెండు రోజుల క్రితం అమెరికా నుంచి గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఆయనకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. తక్షణమే తాము అడిగినంత డబ్బు ఇస్తే అబ్దుల్ మహ్మద్ అరాఫత్ విడిచిపెడతామని లేకుంటే కిడ్నీలు అమ్మేసి చంపేస్తామని బెదిరించారు. దీంతో వారు తీవ్ర ఆందోళనగా ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే ద్వారా మళ్ళీ విదేశాంగ శాఖ ఉన్నతాధికారులకు ఈ విషయం తెలియజేసి తన కొడుకు కాపాడాలని విజ్ఞప్తి చేశారు. అబ్దుల్ మహ్మద్ అరాఫత్‌ని కిడ్నాప్ చేసిన వారు అమెరికాలో మాదక ద్రవ్యాల ముఠా అని తెలుస్తోంది. 


Related Post