ఆటా అధ్వర్యంలో తెలంగాణా సేవా డేస్

November 22, 2017
img

అమెరికాలో స్థిరపడిన తెలంగాణావాసులు తమ జీవితాలలో ఉన్నతశిఖరాలు చేరుకోవడంతో తమ లక్ష్యం నెరవేరిందని, ఇక జీవితంలో చేయవలసింది..సాధించవలసింది ఏమీ లేదని సంతృప్తిపడిపోకుండా తాము ఈ స్థాయికి చేరుకోవడానికి కారణమైన సమాజానికి, మాతృభూమికి అవసరమైన సేవలు, సహాయసహకారాలు చేసి మాతృభూమి రుణం తీర్చుకోవడానికి సదా కృషి చేస్తుంటారు. 

అమెరికా తెలంగాణా అసోసియేషన్ (ఆటా) అధ్వర్యంలో ‘తెలంగాణా సేవా డేస్’ పేరుతో నవంబర్, డిసెంబర్ రెండు నెలలపాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆటా చైర్మన్ కరుణాకర్ మాధవరం తెలిపారు. అందుకోసం ఆటా ప్రెసిడెంట్ సత్య కందిమల్ల, సాంస్క్రుతిక ప్రతినిధి పద్మజారెడ్డి, ఇండియా కో ఆర్డినేటర్ వెంకట్ మంతెన, సంస్థ సభ్యులు సుధీర్ జలగం, రమేష్ ఆకుల తదితరులు హైదరాబాద్ వచ్చారు. రాష్ట్రంలో వృద్ధాశ్రమాలు, అనాధాశ్రమాలు, ప్రభుత్వ పాఠశాలలలో మౌలికవసతుల కల్పన, పేద విద్యార్ధులకు పుస్తకాలు, బ్యాగులు వగైరా పంపిణీ వంటి సేవా కార్యక్రమాలను చేపట్టారు. 

డిసెంబర్ 3న డ్రగ్-ఫ్రీ తెలంగాణా, డ్రగ్ ఫ్రీ హైదరాబాద్ పేరుతో మాదకద్రవ్యాలను వ్యతిరేకంగా హైదరాబాద్ లో నెక్లెస్ రోడ్డులో 5కె రన్ నిర్వహించనున్నారు. అదేరోజున సాయంత్రం 5 గంటల నుంచి రవీంద్ర భారతిలో ‘ప్రవాస తెలంగాణా ధూమ్ ధామ్’ పేరిట సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. ఆటా ప్రతినిధులు నిన్న హైదరాబాద్ లో డిజిపి ఎం.మహేందర్ రెడ్డిని కలిసి ఈ కార్యక్రమాలలో పాల్గోనవలసిందిగా ఆహ్వానించారు. 

వచ్చే ఏడాది జూన్ 29 నుంచి మూడు రోజుల పాటు అమెరికాలో హ్యుస్టన్ నగరంలో ఆటా అధ్వర్యంలో ప్రపంచ తెలంగాణా మహాసభలు నిర్వహించబోతున్నట్లు ఆటా చైర్మన్ కరుణాకర్ మాధవరం తెలిపారు.

Related Post