హ్యూస్టన్ ‘ఐటి సర్వ్ సినర్జీ’కి ఎన్.ఆర్.ఐ.లు రెడీ

November 16, 2017
img

భారత్, అమెరికా ఐటి రంగాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. రెండు దేశాలు అనేక ఇతర రంగాలతో బాటు ఈ రంగంలో కూడా పరస్పరం సహకరించుకొంటున్నాయి. అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయులు, తెలుగువారు అనేక ఐటి సంస్థల స్థాపించి దిగ్విజయంగా నడిపిస్తూ అమెరికాలో లక్షలాదిమందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. అమెరికాలో టాప్-500 ఐటి సంస్థలతో సహా అమెరికాలోని అనేక ఇతర ఐటి సంస్థలన్నీ కలిసి ఐటి రంగానికి సంబంధించి సమస్యలు, ఉద్యోగావకాశాలు, సేవలు, చట్టాలు వంటి అనేక అంశాలపై చర్చించుకొనేందుకు ‘ఐటిసర్వ్ అలయన్స్’ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసుకొన్నాయి. ఆ సంస్థల సి.ఈ.ఓ.లు క్రమం తప్పకుండా ప్రతీ ఏట సమావేశమవుతూ అన్ని అంశాలపై కూలంకుషంగా చర్చిస్తుంటారు. ఈ నవంబర్ 30వ తేదీ నుంచి డిసెంబర్ 1 వరకు హ్యూస్టన్ నగరంలో ఐటి సర్వ్ సినర్జీ కాన్ఫరెన్స్ జరుగబోతోంది. ఆ సమావేశానికి సన్నాహకంగా అమెరికాలో ఐటి రంగంలో ఉన్న ప్రవాసభారతీయులు అమెరికా కాలమాన ప్రకారం సోమవారం సాయంత్రం 6.30-7.30 వరకు (భారతీయ కాలమాన ప్రకారం మంగళవారం ఉదయం 5-6 గంటలకు) సమావేశమయ్యారు. 

త్వరలో జరుగబోయే ‘ఐటి సర్వ్ సినర్జీ కాన్ఫరెన్స్’ లో చర్చించాల్సిన అంశాలు, ఆ సంస్థ యొక్క లక్ష్యాలు, ‘ఐటి సర్వ్ అలయెన్స్’ లో సభ్యులుగా చేరడం వలన ఐటి సంస్థలకు, అవుట్ సోర్సింగ్ సంస్థలకు కలిగే ప్రయోజనాలు మొదలైన అంశాలపై లైవ్ చర్చా కార్యక్రమం జరిగింది.  

టివి-5, మన టీవి (అమెరికా) న్యూస్ ఛానల్ సీఈఓ శ్రీధర్ చిల్లర నేతృత్వంలో జరిగిన ఈ లైవ్ చర్చావేదికలో వెంకట్ మారం, సందీప్ కిలారు, హరీష్ బతిని, వేణు సంగాని,  ప్రవీణ్ అండపల్లి, రామకృష్ణ కొండూరు, రఘు చిట్టిమళ్ళ తదితరులు హాజరయ్యారు. హ్యూస్టన్ లో జరుగబోతున్న ఈ  ‘ఐటి సర్వ్ సినర్జీ కాన్ఫరెన్స్’ లో ఐటి రంగంతో సంబంధం ఉన్నవారు ఎవరైనా ముందుగా తమ పేర్లను ‘ఐటి సర్వ్ అలయన్స్’ వెబ్ సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకొని పాల్గొనవచ్చు. అదే విధంగా ఆసక్తిగలవారు ఈ సంస్థలో సభ్యులుగా కూడా చేరవచ్చు. లేదా ఈ సమావేశాలలో చర్చించిన అంశాలు లేదా వాటికి సంబంధించిన ఇతర వివరాలను సంస్థ వెబ్ సైట్ లో చూడవచ్చు. 


Related Post