అందుకు మీరు అర్హులు కారు...కనుక అణుబాంబు వేసేస్తాం

September 14, 2017
img

ఉత్తర కొరియా మళ్ళీ తన నోటి దురదను మరోసారి ప్రదర్శించింది. ఈసారి జపాన్ ను ఉద్దేశ్యించి చాలా నీచమైన వ్యాఖ్యలు చేసింది. 

“జపాన్ మా పొరుగుదేశంగా ఉండటానికి పనికిరాదు. కనుక దానిపై అణుబాంబు వేసి దానిని సముద్రంలో కలిపేస్తాం. అమెరికా, దక్షిణ కొరియా దేశాలు చాలా విర్రవీగుతో మా ముందు కుప్పిగంతులు వేస్తున్నాయి. వాటికి మా సామర్ద్యం ఏమిటో రుచి చూపించడానికే (జపాన్ మీదుగా) ఆ క్షిపణిని ప్రయోగించాము. అయినా వాటికి బుద్ధి రాలేదు. జపాన్ కూడా వాటికి వంతపాడుతోంది. అందుకే ఇక దానికి మాపక్కన ఉండే అర్హత లేదు. దానిని సముద్రంలో కలిపేయవలసిందే,” అని ఉత్తర కొరియా అధికారిక న్యూస్ ఛానల్ హెచ్చరించింది. 

ఈ హెచ్చరికలను జపాన్ చాలా తీవ్రంగా పరిగణించి, ఐక్యరాజ్యసమితికి పిర్యాదు చేసింది. ఉత్తర కొరియా చేస్తున్న ఇటువంటి ప్రకటనలు తమ దేశభద్రతకు సవాలు విసురుతున్నాయని జపాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి యోషిహిడె సుగా అన్నారు. 

ఉత్తర కొరియా నిత్యం విసురుతున్న ఇటువంటి సవాళ్ళను చూసి చూసి అమెరికా, జపాన్, దక్షిణ కొరియా దేశాలు చాలా విసిగిపోయున్నాయి. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిం జాంగ్ ఉన్ చేతిలో ఉన్న అత్యంత శక్తివంతమైన అణ్వాయుధాలు పిచ్చోడి చేతిలో రాయిలా మారడంతో అతను ఎప్పుడు ఏ దేశంపైకి ప్రయోగిస్తాడనే భయం, ఆందోళనతో ఉన్నాయి. కానీ అతను అటువంటి సాహసం చేసిన మరుక్షణం ఎదురుదాడి చేయడానికి అమెరికా సర్వం సిద్ధంగా ఉందని డోనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. కనుక యుద్ధవాతావరణం స్థిరంగా నెలకొనే ఉందని చెప్పవచ్చు. ఒకసారి యుద్దమంటూ మొదలైతే దానికి ఉత్తర, దక్షిణ కొరియా, జపాన్, గువాం దీవులే మొదట బారీ మూల్యం చెల్లించక తప్పదు. దీనికంతటికీ మూలకారకుడైన కిం జాంగ్ ఉన్ ఉండే ప్రాంతాన్ని కనిపెట్టి, క్షిపణి ప్రయోగించి అతనిని మట్టుబెట్టేందుకు దక్షిణకొరియా వ్యూహం సిద్ధం చేస్తోందనే వార్త ఒకటి బయటకు వచ్చింది.

Related Post