గల్ఫ్ భాదితుల కష్టాలు ఎవరు తీరుస్తారు?

December 12, 2016
img

రాష్ట్రంలో కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్, నిజామాబాద్, హైదరాబాద్ జంట నగరాల నుంచి చాలా మంది కార్మికులు, సాంకేతిక నిపుణులు గల్ఫ్ దేశాలకి వెళుతుంటారు. ఒకప్పుడు గల్ఫ్ దేశాలకి వెళ్ళినవారి జీవితాలలో నిజంగానే వెలుగులు నిండాయి. కానీ అక్కడ కూడా క్రమంగా పరిస్థితులు మారడంతో జీతాలు, వసతులు అన్నీ తగ్గిపోయాయి. ఇప్పుడు ప్రైవేట్ సంస్థలు ఇచ్చే జీతాలతో అక్కడ బ్రతకడమే కష్టంగా మారింది. ఇంక ఇంటికి ఏమి పంపుతారు? అయినప్పటికీ నేటికీ అనేకమంది కార్మికులు, ముఖ్యంగా కూలి పనులు చేసుకొనేవారు బ్రోకర్ల మాటలు నమ్మి భార్య మేడలో పుస్తెలు కూడా అమ్ముకొని అప్పులు చేసి మరీ వారికి వేల రూపాయలు ముట్టజెప్పి గల్ఫ్ దేశాలకి వెళుతుంటారు. ఆ తరువాత అక్కడ వారు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. తినడానికి తిండి లేక, తలదాచుకోవడానికి ఇల్లు లేక, చేసేందుకు ఉద్యోగం లేక, పోలీసులకి చిక్కితే జైలు పాలవుతామనే భయంతో దుర్భర జీవితం అనుభవిస్తున్నవారు కోకొల్లలు ఉన్నారు. 

ఈ బాధలు తట్టుకోలేకనో లేదా ప్రమాదవశాత్తు లేదా మరే కారణం చేతైన అక్కడ ప్రాణాలు కోల్పోతే ఇక వారి శవాలు నెలల తరబడి మార్చురీ గదుల్లో మగ్గాల్సిందే. అసలు వారు చనిపోయిన సంగతి కూడా తెలియక వారి నుంచి కబురు రాలేదని తల్లడిల్లిపోయే తల్లులు, ఇల్లాళ్ళు, పిల్లలు రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. ఒకవేళ తెలిసినా వారి శవాలని వెనక్కి తెప్పించుకోలేని పరిస్థితి. సౌదీ నియమ నిబంధనల ప్రకారం అక్కడ అంత్యక్రియల నిర్వహించడం కూడా కష్టమే. విదేశాంగ లెక్కల ప్రకారమే రెండు తెలుగు రాష్ట్రాలకి చెందిన సుమారు 150 మంది శవాలు దాదాపు ఏడాదిగా సౌదీ మార్చురీ గదుల్లో ఉండిపోయాయి. అయినా వారి ఆత్మీయులు కన్నీళ్ళు కార్చడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. 

చిన్న చిన్న ప్రైవేట్ కంపెనీలలో, ఇళ్ళల్లో పనిచేస్తున్నవారు చనిపోయినట్లయితే, వారి శవాలని భారత్ తరలించడానికి అయ్యే రూ. 4-6 లక్షల ఖర్చుని యజమానులే భరించాల్సి ఉంటుంది. కానీ వారు అందుకు అంగీకరించకపోవడంతో వారి శవాలు మార్చురీ చేరుకొంటాయి. ఇక రోడ్డు ప్రమాదాలు, హత్యలు లేదా ఆత్మహత్యలలో మరణించినవారి కేసులపై దర్యాప్తు పూర్తయ్యేవరకు పోలీసుల శవాలని తిరిగి ఇవ్వరు. దానికి రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుంది. కానీ వారి శవాల తరలింపుకి అయ్యే ఖర్చుల విషయంలో సమస్యలున్నందున అవి కూడా మార్చురీకే చేరుకొంటాయి. 

ఒకవేళ వారి స్నేహితులు లేదా భారత్ లోని కుటుంబ సభ్యులు వారి శవాలని వెనక్కి రప్పించుకోవాలంటే దానికీ బోలెడంత పేపర్ వర్క్ జరుగవలసి ఉంటుంది. శవాల తరలింపు కోసం డబ్బు సమకూర్చుకోవలసి ఉంటుంది. ఒక్క సౌదీ అరేబియాలోనే ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలకి చెందినవారు సుమారు 10 లక్షల మంది పనిచేస్తున్నారు. ఇక గల్ఫ్ దేశాలన్నీ, వాటిలో పనిచేస్తున్న భారతీయులందరి సంఖ్య దానికి పదింతలు ఉండవచ్చు. 

అంతమంది భారతీయులు గల్ఫ్ దేశాలలో పనిచేస్తున్నా కూడా వారి యోగక్షేమాలని, ఇటువంటి కష్టకాలంలో ఆదుకొనే నాధుడే లేడు. అన్ని దేశాలలో ఇండియన్ ఎంబసీ కార్యాలయాలు, వాటిలో  అనేకమంది ఉద్యోగులు కూడా ఉంటారు. కానీ చాలా అరుదుగా వారి నుంచి సహాయ సహకారాలు లభిస్తుంటాయి. ఒక వ్యక్తి దురదృవశాత్తు దేశం కానీ ఆ దేశాలలో కష్టాలలో చిక్కుకొన్నా, ప్రమాదంలో గాయపడినా, చనిపోయినా ఇక అతనిని పైనున్న ఆ దేవుడే కాపాడాలి. 

అటువంటి పరిస్థితులలో చిక్కుకొన్నవారి స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు కొందరు తెలంగాణా జాగృతి, తెరాస ప్రజా ప్రతినిధుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎంపి కవితని ఆశ్రయించినప్పుడు అతి కష్టం మీద వారి ఆత్మీయుల శవాలని వెనక్కి రప్పించగలిగారు. 

పొట్ట కూటికని గల్ఫ్ దేశాలు వెళితే ఇటువంటి సమస్యలు ఎదుర్కోవలసి రావడం చాలా దురదృష్టమే. కార్మికులని గల్ఫ్ దేశాలకి వెళ్ళడానికి రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేయడం కంటే ఇప్పుడు మన రాష్ట్రంలోనే ఉపాధి అవకాశాలు చాలా బారీగా పెరుగుతున్నందున వారికి రాష్ట్రంలోనే ఉపాధి చూపేందుకు  వ్యవస్తలని ఏర్పాటు చేస్తే వారికీ, వారి వలన రాష్ట్రానికి కూడా మేలు కలుగుతుంది కదా?    


Related Post